పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం..
Ens Balu
4
కంటోన్మెంట్
2020-11-07 15:27:01
విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న బాలాజీ టెక్స్‌టైల్ మార్కెట్‌లో పారిశుద్ధ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పచ్చదనంపై రోజువారీ తనిఖీల్లో భాగంగా కంటోన్మెంట్ ప్రాంతంలోని చెరువులు, పార్కులు, గతంలో మొక్కలు నాటిన ప్రదేశాలను కలెక్టర్ శనివారం హరిత విజయనగరం బృందం సభ్యులతో కలసి తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఆ ప్రాంతంలోని టెక్స్‌టైల్ మార్కెట్ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ కలెక్టర్‌కు అపారిశుద్ద్య పరిస్థితులు కనిపించాయి. చెత్త చెదారం, దుర్గంధంతో కూడుకొని ఉన్న పరిసరాలను చూసి కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉండాల్సిన మార్కెట్ ఉండేది ఇలాగేనా? లాభాలే తప్ప వినియోగదారుల ఆరోగ్యం పట్టదా అంటూ మార్కెట్ కార్యవర్గ ప్రతినిధులను ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చే వినియోగదారులు అనారోగ్యం పాలైతే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తక్షణం పరిస్థితుల్లో మార్పు రావాలని లేనిపక్షంలో నగరపాలక సంస్థ ద్వారా తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై వర్తక సంఘం ప్రతినిధులు స్పందిస్తూ వారం పది రోజుల్లో మార్కెట్ లో పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తామని, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరుస్తామని కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. మార్కెట్‌లో నాటిన మొక్కల పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. మొక్కల సంరక్షణపై సంతృప్తి వ్యక్తంచేశారు.
ఇదే ప్రాంతంలోని వినాయకనగర్ పార్కును కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, హరిత విజయనగరం బృందం సభ్యులు పరిశీలించారు. ఇక్కడ నాటిన మొక్కలన్నీ సజీవంగా ఉండటంపై పార్కు నిర్వహణపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు. సెయింట్ జోసెఫ్ స్కూలు ఎదురుగా సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న రెండు ఆక్సిజన్ పార్కులను సందర్శించి అక్కడ మొక్కల పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. మొక్కల సంరక్షణ పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.
చెరువుల శుద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కె.ఎల్.పురంలోని చెరువును కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ చెరువును స్థానిక కాలనీ వాసులు నిర్వహిస్తున్న తీరును అభినందించారు. ఇక్కడ నాటిన మొక్కలు పెంచేందుకు తీసుకున్న శ్రద్ధ వహించడంపై సంతోషం వ్యక్తంచేస్తూ కాలనీ వాసుల కోరిన మేరకు చెరువు గట్టుపై లైటింగ్, కొన్ని బెంచీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీలోని రాధాకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. జిల్లా కలెక్టర్ చొరవతోనే తమ కాలనీలోని చెరువు అభివృద్ధి జరిగి ఆహ్లాదకర ప్రదేశంగా రూపుదిద్దుకుందని, ఈ చెరువు పరిసరాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని వారు హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, పి.టి.సి. వైస్ ప్రిన్సిపల్ మెహెర్‌బాబా, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డా.సత్యనారాయణ, హరిత విజయనగరం కన్వీనర్ రామ్మోహన్, జర్నలిస్టు బోనం గణేష్ తదితరులు పాల్గొన్నారు.