ప్రక్రుతి వనరులను పరిరక్షించుకోవాలి..
Ens Balu
2
Vizianagaram
2020-11-07 15:37:57
ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతీఒక్కరి బాధ్యత కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పిలుపునిచ్చారు. జల సంరక్షణలో ఇటీవల జిల్లాకు జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ను, జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, పూల గుచ్ఛాలు, దుశ్శాలువలతో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రకృతి సంపదను సంరక్షించడమే తనకు అసలైన జ్ఞాపిక అని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని, పరిశ్రమలు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. గత రెండేళ్లతో పోలిస్తే, విజయనగరం జిల్లాలో పచ్చదనం పరంగా గణనీయమైన మార్పు చోటు చేసుకుందని చెప్పారు. జిల్లా కేంద్రంలో తాము చేపట్టిన కృషికి తగిన ఫలితాలు రావడం మొదలయ్యిందన్నారు. హరిత విజయనగరంగా మార్పు చేయడమే కాకుండా, అభివృద్దికి ఎన్నో ప్రణాళికలను అమలు చేసి, పట్టణ రూపురేఖలను మార్పు చేశామని చెప్పారు. విజయనగరం చారిత్రక నగరమని, కళలకు, సంస్కృతికి రాజధాని అని పేర్కొన్నారు. ఆ ఖ్యాతిని నిలబెట్టేటందుకు గాను పలు చోట్ల సైన్‌బోర్డులను ఏర్పాటు చేసి, ప్రజలకు తమ చరిత్రను, గొప్పదనాన్ని గుర్తు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
పరిశ్రలమశాఖ జిల్లా జనరల్ మేనేజర్ కె.ప్రసాదరావు మాట్లాడుతూ సాధారణంగా నీటిని పరిశ్రమలకే ఎక్కువగా వినియోగించడం జరుగుతోందని చెప్పారు. దీనికి విరుద్దంగా జిల్లాలోని పరిశ్రమల్లో మాత్రం అతి తక్కువ నీటిని వినియోగించడం ద్వారా అవార్డు సాధనలో తాము కూడా భాగస్వామ్యులం అయ్యామని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో, జిల్లాలోని పారిశ్రామిక వేత్తలంతా తమ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచడమే కాకుండా, ప్రకృతి వనరులను సంరక్షించే చర్యలను చేపట్టారని చెప్పారు. దీనిలో భాగంగా నీటి పునర్ వినియోగానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, పారిశ్రామికంగా అతి తక్కువ నీటిని వినియోగించడం జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ఎడి ఐ.వెంకటరమణ, డెక్కన్ ఫెర్రో అల్లాయిస్ ఎండి పిఎస్ఆర్ రాజు, శారద మెటల్స్ అండ్ అల్లాయిస్ జిఎం ప్రభాత్ మోహన్, ఎజిఎం(హెచ్ ఆర్) హెచ్.సన్యాశిరావు, బెర్రీ అల్లాయిస్ ఎండి విజయశ్రీ తదితర పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.