లింగ నిర్ధారణ పరీక్షలపై ఉక్కుపాదం..
Ens Balu
3
కలెక్టరేట్
2020-11-07 17:03:36
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నేరమని, ఇలాంటివాటికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. గర్భస్థ శిశు లింగ నిర్దారణ నిషేద చట్టం అమలుపై తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మహేష్‌కుమార్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచి, లింగ నిర్ధారణ జరిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లు వివరాలను తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేసేలా చూడాలని సూచించారు. మేన్యువల్ విధానానికి బదులుగా ఇకనుంచీ ఆన్ లైన్ ద్వారానే రెన్యువల్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రజల్లో ఆడపిల్లలపట్ల వివక్షతను రూపుమాపేందుకు గానూ పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ఎండిఆర్‌పై సమీక్షిస్తూ, జిల్లాలో మాతృమరణాలను తగ్గించేందుకు కృషి చేయాలని జెసి కోరారు. దీనికోసం తల్లితండ్రులు, గర్భిణుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ గర్భిణికి తగినంత పౌష్టికాహారాన్ని, అవసరమైన విటమిన్‌లు, ఇతర మందులను అందేలా చూడాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన మాతృమరణాలపై కేసుల వారీగా సమీక్షించారు. ముందుగానే ఆసుపత్రులకు తరలించడం ద్వారా మరణాలను నివారించవచ్చని చెప్పారు. ప్రతీ గర్భిణిని, ప్రసవం కోసం తప్పనిసరిగా ఆసుపత్రికి తరలించాలన్నారు. అవసరమైతే బలవంతంగానైనా వారిని ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, ఫ్యామిలీకోర్టు జడ్జి ఎం.మాధురి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, డిఇసిహెచ్ఎస్ డాక్టర్ నాగభూషణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.