మొదలైన పత్తికొనుగోళ్లు ప్రక్రియ..


Ens Balu
3
Vizianagaram
2020-11-07 17:07:08

విజయనగరం జిల్లాలో ప్రత్తి కొనుగోలు సంబంధించి ప్రక్రియ మొదలయ్యింది. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ మార్కెటింగ్, భారతీయ ప్రత్తి సంస్థ సభ్యులు, వ్యవసాయ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో పలు మార్గనిర్దేశకాలు జారీ చేశారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రత్తి విక్రయించాలనుకొనే రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా చేపట్టాలని చెప్పారు. కొనుగోలుకు సంబంధించి ప్రతీ అంశంపైనా రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసి.. ఏ రోజు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్ళి విక్రయించుకోవచ్చనే విషయాన్ని ముందుగానే రైతుకు సంక్షిప్త సందేశాలు పంపించాలని చెప్పారు. ముందుగా అనుకున్న రోజున ప్రత్తి కేంద్రానికి తీసుకురాలేని పక్షంలో మరొక్క రోజు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు కూడా నాణ్యమైన ప్రత్తి తీసుకురావాలని, అధికారులకు సహకరించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందీ ఉన్న సిఎం ఆప్ లో నమోదు చేయవచ్చని సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది మారిన నిబంధనల ప్రకారం ఏటా మాదిరిగా విజయనగరం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని జేసీ ప్రశ్నకు బదులుగా మార్కెటింగ్ ఏడీ వై.వి.శ్యామ్ కుమార్  స్పష్టం చేశారు. రామభద్రపురం పరిధి బూసయ్యవలస గ్రామంలో ఉన్న నంది జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులు రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం నకలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే తేమ 8 నుంచి 12 శాతం ఉంటేనే భారతీయ సంస్థ నిబంధనలకు లోబడి కొనుగోలు చేస్తామని భారతీయ ప్రత్తి సంస్థ సభ్యుడైన ప్రవీణ్ స్పష్టం చేశారు. మొదటి రకం ప్రత్తి క్వింటాకు రూ.5,825, ద్వితీయ రకం ప్రత్తికి రూ.5,515 కొనుగోలు ధర నిర్ణయించామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ప్రమాణాలు పాటించిన మీదటే ప్రత్తి కొనుగోలు చేస్తామని, దీనికి రైతులంతా సహకరించాలని కోరారు. సుమారు ఏడు మండలాల రైతులు ప్రత్తి ఎక్కువుగా పండిస్తారు కాబట్టి వారందరికీ కొనుగోలు కేంద్రం రామభద్రపురం సమీపంలో ఏర్పాటు చేసినట్టు సచివాలయాల ద్వారా, గ్రామీణ వ్యవసాయ అధికారుల ద్వారా విరివిరిగా ప్రచారం కల్పించాలని జేసీ సూచించారు. నంది జిన్నింగ్ మిల్లులో భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు కి చెప్పారు. ఏ ఒక్క రైతుకూ చిన్న ఇబ్బంది కూడా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో బి.హెచ్. భవానీ శంకర్, జిన్నింగ్ మిల్లు మేనేజర్ ఎస్.ఖన్నన్, అసిస్టెంట్ కంట్రోలర్ రాధాకృష్ణ, సి.ఐ. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.