సామాజిక రుగ్మలతను రూపుమాపడానికే చట్టాలు..
Ens Balu
2
Srikakulam
2020-11-09 13:31:12
సామాజిక రుగ్మలతను రూపుమాపడానికే చట్టాలను రూపొందించమిని జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. సోమవారం, ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మైక్రో లెవెల్ లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, పౌరులంతా చట్టాలను తెలుసుకోవలసి అవసరం ఎంతైనా వుందన్నారు. 1987 వ సం.లో న్యాయ సేవాధికార సంస్థ ఏర్పడిందని, 1995 నవంబరు 9 వ తేదీన అమలులోకి రావడం జరిగిందని తెలిపారు. కోర్టు ఫీజు చెల్లించుకోలేని నిరుపేదలకు ఉచితంగా న్యాయాన్ని అందించే లక్ష్యంతేనే న్యాయ సేవాధికార సంస్థ ఏర్పడిందని తెలిపారు. కోర్టు ఫీజుతో పాటు కేసులను వాదించడానికి ప్రభుత్వ ఖర్చుతోనే అడ్వోకేట్ ను కూడా నియమించడం జరుగుతుందన్నారు. అత్యంత ధనవంతుడు పొందగలిగే న్యాయాన్ని అత్యంత పేదవాడు ఉచితంగా పొందే అవకాశం న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కలుగుతుందన్నారు. విద్యార్ధులు చట్టాలపై అవగాహన పొంది చైతన్యవంతులు కావాలన్నారు. మహిళలు ఆపదలో రక్షణకోసం 100 నెంబరుకు తక్షణమే ఫోన్ చేయాలన్నారు. స్వీయ రక్షణకు అవసరమైన కోర్సులను నేర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందన్నారు. ఎస్.సి, ఎస్.టి.లకు, మారు మూల ప్రాంత ప్రజలకు న్యాయంపై, అవగాహన కలిగించడం జరుగుతున్నదన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సత్వర న్యాయాన్ని ఉచితంగా అందిస్తుందనే విషయాన్ని తమ బంధువులు, తల్లితండ్రులకు తెలియచేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా తమను తాము రక్షించుకునే అవకాశం కలుగుతుందన్నారు. హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించగలమన్నారు. బాలికల రక్షణకు అనేక చట్టాలు వున్నాయని, సమస్యలను ప్రారంభంలోనే తెలియచేసి సమస్య పెద్దది కాకుండా రక్షణ పొందాలని ఫామిలీ కోర్టు జడ్డి పి. అన్నపూర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెకెండ్ అడిషినల్ డిస్ట్రిక్ట్ జడ్జి వెంకటేశ్వర్లు, లోక్ అదాలత్ శాశ్వత అధ్యక్షులు సి.బి. సత్యన్నారాయణ, గవర్నమెంట్ ప్లీడర్ పి.వి.రమణా రావు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబరు వాసుదేవరావు, బార్ సెక్రటరీ కృష్ణప్రసాద్, జి.లెనిన్ బాబు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, డి.ఎస్.పి. డి.ఎన్.ఆర్ మూర్తి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ (మహిళ) ప్రిన్సిపాల్ ఎం.కృష్ణవేణి, కళాశాల విద్యార్ధినులు, తదితరులు హాజరయ్యారు.