ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంతో దోస్తానా..
Ens Balu
2
Jagadamba Centre
2020-11-09 14:16:07
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని వైసిపి, టిడిపి పార్టీలు రెండు ఎందుకు రాజీ పడుతున్నాయి అన్న అంశంపై సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ముద్రించిన ‘‘రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపితో వైసిపి, టిడిపి రాజీ ఎందుకు?’’ అన్న పుస్తకాన్ని ఈరోజు సిపిఎం నగర కార్యలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావ్ మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆనాడు బిజెపి ప్రకటించింది కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ఆరు సంవత్సరాల నుండి పరిపాలిస్తూ వాగ్దానం అమలు చేయాలేదని విమర్శించారు. ఆనాడు పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టంలో అనేక వాగ్ధానాలు చేసినా... రాజధాని నిర్మాణానికి ,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగినన్ని నిధులు ఇస్తామని, కడప స్టీల్ ప్లాంట్ కర్మాగారం, దుగ్గరాజుపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వాగ్ధానాలు వెనక్కి పోయాయని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రానికి ఆర్ధిక పరిపుష్టిత కలిగించే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని రాష్ట్ర హక్కులను లాక్కుంటున్నారని ఇటువంటి తరుణంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కనీసం స్పందించడం లేదని ఎందుకు కేంద్రంలో ఉన్న బిజెపితో రాజీ పడుతున్నారని ప్రశ్నించారు. ఈ సమస్యలపై వారం రోజుల పాటు నగర వ్యాప్తంగా పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని వివరించారు. ఈ వారం రోజులు జరిగే ప్రచారానికి రెండులక్షల కరపత్రాలు 50 వేల పుస్తకాలను ముద్రించి ప్రజల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పుస్తకావిష్కరణలో కార్యవర్గ సభ్యులు ఆర్‌కెయస్వీ కుమార్, నగర కమిటీ సభ్యులు పి.మణి, వి.కృష్ణారావు, మద్దిలపాలెం జోన్ కమిటీ సభ్యులు ఎ.అప్పారావు, పి.వెంకటరావు, కుమారి తదితరులు పాల్గొన్నారు.