సంక్షేమ పథకాలు పక్కాగా అందాలి..


Ens Balu
3
Seethampeta
2020-11-09 18:20:59

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడు పనులు, గ్రామ సచివాలయాల పనితీరు, భవనాల నిర్మాణాల ప్రగతిని పరిశీలించుటకు సోమ వారం ముఖ్య కార్యదర్శి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా సీతంపేటలో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, వీరఘట్టాం మండలం వండువ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు - నేడు పనులు., సీతంపేట మండలం పెద్దూరు, వండువలో సచివాలయ భవనం, హైల్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. నాడు – నేడు క్రింద చేపట్టిన మరుగుదొడ్ల ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఆధునీకరణకు ముందు ఉన్న స్ధితి ఫోటోలు ఉండాలని ఆయన చెప్పారు. మరుగుదొడ్లలో ఉపయోగించిన పరికరాలు, నీటి సరఫరాను పరిశీలించారు. ట్యాప్ నుండి వస్తున్న నీటి ఫోర్సును పరిశీలించగా నెమ్మదిగా సరఫరా కావడంపై సంబంధిత ఇంజనీర్లను ప్రశ్నించారు. నీరు ఫోర్సుగా రావాలని ఆదేశించారు. ఆది వారం నాడు పనులు ముగించామని, టెస్టింగు చేయాల్సి ఉందని ఇంజనీర్లు తెలియజేయగా నవంబరు 3వ తేదీన పాఠశాలలు ప్రారంభం కావలసి ఉందని, ప్రారంభం అయి ఉంటే పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు. పై అధికారులు వచ్చి తనిఖీ చేస్తారని పనులు చేపట్టడం కాదని పనిలో నిమగ్నత ముఖ్యమని వృత్తి నిపుణత పాటించాలని పేర్కొన్నారు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని దానిని పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేసారు. నాడు – నేడు కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తించాలని, ముఖ్య మంత్రి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన అన్నారు. నాడు – నేడు కార్యక్రమంలో నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్ల కల్పన, తాగు నీరు, పాఠశాల మరమ్మతులు, విద్యుదీకరణ – ఫ్యాన్ లు, విద్యుద్దీపాల కల్పన, ఫర్నీచరు, గ్రీన్ బోర్డు, పాఠశాలలకు ఆహ్లాదకర రంగులు, ఇంగ్లీషు లాబ్ లు, ప్రహారీగోడల నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. పనులు చేపట్టిన అనంతరం నిర్వహణ పక్కాగా ఉండాలని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల కంటే అధిక స్థాయిలో ఉన్నామని పిల్లల్లో భావన కలగాలని అన్నారు. అధికారులు అభివృద్ది కార్యక్రమాలలో ఏ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాన్ని గుర్తించాలని ఆయన స్పష్టం చేసారు. అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన రంగాల్లో ప్రారంభం కావాలని సూచించారు. పెద్దూరులో  గ్రామ సచివాలయం, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్, వై.యస్.ఆర్ రైతు భరోసా కేంద్రం పనులు పరిశీలించుటకు విచ్చేసిన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు గ్రామ ప్రజలు సవర నృత్యంతో ఘన స్వాగతం పలికారు. నృత్య బృందంలోని గిరిజన మహిళలకు ఆసరా, చేయూత తదితర పథకాల క్రింద అందిన ఆర్ధిక సహాయంపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు పట్ల ప్రజల్లో అవగాహన ఉండాలని అన్నారు. తదుపరి విడతల్లో అందే మొత్తాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఏ పథకం క్రింద ఎంత మొత్తం అందుతుందో ప్రతి ఒక్కరికి విధిగా తెలిసి ఉండాలని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. పెద్దూరులో గ్రామ సచివాలయంను రూ.40 లక్షలు, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ ను రూ.17.50 లక్షలు, వై.యస్.ఆర్ రైతు భరోసా కేంద్రం ను రూ.21.80 లక్షలతో నిర్మాణం పనులు చేపడుతున్నారు. మండలంలో ప్రారంభమైన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వండువ గ్రామ సచివాలయంను తనిఖీ చేసిన ముఖ్య కార్యదర్శి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎం.పి.డి.ఓ ను ప్రశ్నించారు. రెండవ విడతలో పంపిణీ చేస్తున్న చేదోడు, వాహన మిత్ర,, చేయూత తదితర కార్యక్రమాల లబ్దిదారుల వివరాలు ఎందుకు ప్రదర్శించ లేదని ప్రశ్నించారు. సచివాలయం గోడపై పథకాలకి స్థలాన్ని కేటాయిస్తూ వాటి వివరాలు పెట్టాలని ఆదేశించారు. ప్రతి కార్యక్రమం వివరాలు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. సచివాలయంలో ప్రతి ఉద్యోగి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో ప్రతి సచివాలయ ఉద్యోగి భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇది నా బాధ్యత కాదు అనే భావన ఉండరాదని స్పష్టం చేసారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందాలనే ఆశయంతో ముఖ్యమంత్రి సచివాలయాలను ఏర్పాటు చేశారని గుర్తించాలని చెప్పారు. ఆ ఆశయాలు గ్రామ సచివాలయం ద్వారా నెరవేరాలని, స్ఫూర్తి దాయక పనితీరు కనపడాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ జాయింట్ కలెక్టర్ తనిఖీలు నిర్వహిస్తూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్లు కృషి చేయాలని ఆదేశించారు. సచివాలయం చక్కని పనితీరుకు జాయింట్ కలెక్టర్ మార్గదర్శనం చేయాలని అన్నారు. అనంతరం నిర్మాణం లో ఉన్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు.