విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి..


Ens Balu
2
Srikakulam
2020-11-09 18:29:00

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆమదాలవలస మండలం  సంకిలి జెడ్పి ఉన్నత పాఠశాలను సోమవారం  ఆకస్మికంగా తనిఖీ చేసారు. 9,10 తరగతులకు జరుగుతున్న విద్యా బోధన పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నది పరిశీలించారు. విద్యార్ధులకు ఇప్పటి వరకు పూర్తి చేసిన సిలబస్ వివరాలు పరిశీలించారు. విద్యార్ధుల నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు తనిఖీ చేసారు. బోధన చేస్తున్న విధానాన్ని ఉపాధ్యాయులకు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అంటే పవిత్రమైన స్థలం అని పేర్కొంటూ అందరూ సమానమేనని గుర్తించాలని, ఆ విధంగా విద్యార్ధులను తీర్చిదిద్దాలని ఉద్భోదించారు. జగనన్న విద్యా కానుకలో పంపిణీ చేసిన బ్యాగ్ లు, పుస్తకాలు, బూట్లను పరిశీలించిన ప్రవీణ ప్రకాష్ విద్యార్థులు బూట్లు వేసుకోకపోవడం పట్ల అధికారులు, ఉపాద్యాయులను ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలని ఆదేశాలు జారీ చేసారు. అధికారులు ముఖ్యంగా ఐ.ఏ.ఎస్ అధికారులు పథకాల అమలులో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ఐ.ఏ.ఎస్ అధికారులు అంటే ఆఫీస్ ఆన్ వీల్స్ అని ప్రతి కార్యక్రమం అమలులో ప్రత్యేక ముద్ర వేయాలని అన్నారు. దేశంలో క్రమశిక్షణ గల రాష్ట్రాలుగా ఆంధ్ర, తమిళనాడు కు పేరుందని దానిని నిలబెట్టాలని సూచించారు. గత నెల 6వ తేదీన విద్యా కానుక పంపిణీ చేయగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ తక్షణమే అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత వసతుల పట్ల ప్రతి ఒక్కరికీ తెలియాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ గల ఉపాద్యాయులు ఉన్నారని, ఐ.ఏ.ఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు తదితరులను ఉపాధ్యాయులే తయారు చేస్తారని పేర్కొన్నారు. సమాజంలో గొప్ప ఉపాద్యాయులు ఉన్నారని పేర్కొంటూ విలువలుగల సమాజాన్ని తయారు చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. చిన్నప్పటి నుండి ఉత్తమ బోధనను అందించి ఉన్నతులుగా తయారు చేయాలని అన్నారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ సీతంపేటలో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్య కార్యదర్శికి వీరఘట్టాం మండలం వండువ గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పాలకొండ శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి తన స్వగ్రామైన వండువలో ముఖ్య కార్యదర్శికి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఏ పిఓ సి.హెచ్.శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, పాలకొండ ఆర్.డి.ఓ టివిఎస్ జి కుమార్, పీఆర్ ఎస్ఇ ఎస్.రామ్మోహన్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ డిడి ఎం. కమల, ఇఇ  జి.మురళి, గురుకులం ప్రిన్సిపాల్ సురేష్ కుమార్, సంబంధిత మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.