ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చొద్దు..
Ens Balu
2
Gajapatinagaram
2020-11-09 19:43:40
విజయనగరం జిల్లాలో గజపతినగరం మండలం మరుపిల్లి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తనిఖీ చేశారు. కాపునేస్తం జాబితాను ప్రదర్శనకు ఉంచకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు పారదర్శకంగా, మరింత మెరుగైన సేవలను అందించడానికి ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చిందని చెప్పారు. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా లక్షల మంది సచివాలయ ఉద్యోగులను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. సచివాలయంలో చేయాల్సిన ప్రధాన విధులను విస్మరించడం తగదన్నారు. ప్రతీ సచివాలయంలో తప్పనిసరిగా లబ్దిదారుల జాబితాలను ప్రదర్శించడం, ఎవరు ఏ పథకానికి అర్హులో సవివరంగా తెలియజేయడం, అలాగే ఆయా పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసే విధానాన్ని కూడా సమగ్రంగా వివరించడం సచివాలయ ప్రధాన విధులని తెలిపారు. ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా తాము పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. సిబ్బంది ప్రజలతో మమేకం అయి, వారి బాగోగులను పట్టించుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారులు సైతం వారంలో 7 రోజులూ ప్రజల్లో ఉండాలని, ఆఫీసులకే పరిమితం కావడం సరికాదని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. అనంతరం గజపతినగరంలోని శ్రీకృష్ణ, హర్షవర్థన ప్రయివేటు పాఠశాలలను పరిశీలించారు. గజపతినగరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. అనంతరం అక్కడి బిఎస్ఆర్ ఆసుపత్రిని పరిశీలించి, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలమధ్య తేడాలను గమనించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్, జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, పార్వతీపురం సబ్‌కలెక్టర్ విదేహ్ ఖరే, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, విజయనగరం ఆర్‌డిఓ బిహెచ్.భవానీశంకర్, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, డ్వామా పిడి ఏ.రాజగోపాల్, డిఇఓ జి.నాగమణి, పిఆర్ ఎస్ఇ జిఎస్ఆర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.