సౌరవిద్యుత్ వాడకాన్ని పెంచాలి..
Ens Balu
4
Tirumala
2020-11-09 20:30:32
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి భవనాలపై సౌరఫలకాలు ఏర్పాటుచేసి సౌరవిద్యుత్ వాడకాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పురాణాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన మొక్కలతో పవిత్ర ఉద్యానవనం, శ్రీవారికి అలంకరించేందుకు వీలుగా ప్రత్యేక పుష్ప ఉద్యానవనాలను తిరుమలలో ఏర్పాటుచేయాలని అటవీ విభాగం అధికారులకు సూచించారు. శ్రీవారి దర్శనం, గదులు, సేవల బుకింగ్ విషయంలో భక్తులు మోసపోకుండా నకిలీ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాలని భద్రతా విభాగం అధికారులను ఆదేశించారు. టిటిడి ఆధ్వర్యంలోని వేద పాఠశాలలన్నింటినీ ఎస్వీ వేద వర్సిటీ గొడుగు కిందికి తీసుకురావాలన్నారు. సికింద్రాబాద్‌లోని సంస్కృత కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, శ్రీ పురంధరదాస రచించిన చాలా కీర్తనలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని, అలాంటి వాటిపై దృష్టి సారించాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే సనాతన ధర్మప్రచార కార్యక్రమాలు ఎస్వీబీసీలో ప్రసారమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళమైన భాషలో టిటిడి ప్రచురణల ముద్రణ చేపట్టాలని సూచించారు. గీతాపారాయణం(భగవద్గీత) చిన్నపిల్లలకు అర్థమయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించాలని ఎస్వీబీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్, జెఈవో(ఆరోగ్యం, విద్య) సదా భార్గవి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు.