రేపు కౌన్సిలింగ్ డెస్క్ ప్రారంభం..
Ens Balu
2
Srikakulam
2020-11-10 15:41:34
నేడు పిల్లల దత్తత కౌన్సిలింగ్ డెస్క్ జిల్లా బాలల రక్షణ విభాగం పథక సంచాలకుల కార్యాలయంలో ప్రారంభం కానున్నట్లు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డా.జి.జయదేవి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా నవంబర్ 11న పిల్లలను దత్తత, సమస్యల పరిష్కారంపై కౌన్సిలింగ్ డెస్క్ ఐ.సి.పి.ఎస్ కార్యాలయంలో ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కౌన్సిలింగ్ డెస్క్ వద్ద ప్రొఫెషనల్ కౌన్సిలర్ తో సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పిల్లలను దత్తత తీసుకునే తల్లితండ్రులు, ఇదివరకు దత్తత తీసుకొని సమస్యలతో బాధపడుతున్న తల్లితండ్రులు ఈ కౌన్సిలింగ్ డెస్క్ వద్ద సేవలను ఉచితంగా పొందవచ్చని ఆమె సూచించారు. సంతానం కలగక మనోవేదన పడుతున్న తల్లితండ్రులకు దత్తత ఒక సువర్ణావకాశమని, మాతృత్వం ఒక వరం – దత్తత దానికి మరో మార్గం అని ఆమె చెప్పారు. దత్తత కోరు తల్లితండ్రులకు కారా నిబంధనలు ప్రకారం అర్హతలు ఉంటే పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆమె స్పష్టం చేసారు. కావున పిల్లలను దత్తత కోరు తల్లితండ్రులు ఈ కౌన్సిలింగ్ డెస్క్ ప్రారంభోత్సవానికి హాజరై, దత్తత ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన చేసుకొని పిల్లలను దత్తత పొందాలని ఆమె కోరారు. కౌన్సిలింగ్ డెస్క్ కు హాజరయ్యే తల్లితండ్రులు 08942 – 240630, 240616 ఫోన్ నెంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.