ప్రభుత్వానికి పేదల ప్రాణం విలువ తెలుసు..


Ens Balu
3
Srikakulam
2020-11-10 15:45:57

ప్రాణం విలువ తెలిసన ప్రభుత్వం మనది అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డా.వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా 2,434 వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన దాదాపు అన్ని చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. 2,434 చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. వార్షిక ఆదాయ పరిమితి రూ.5 లక్షలు ఉన్న వారందరూ దీని పరిధిలోకి వస్తున్నారని, దాదాపు 95 శాతం కటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 6 జిల్లాల్లో అమలు చేస్తున్న 2,434 వైద్య ప్రక్రియలను మిగిలిన 7 జిల్లాల్లో కూడా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2059 చికిత్సలతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఇతర జిల్లాల్లో 1059 చికిత్సల నుండి 1313 కు పెంపు చేశామని, ప్రస్తుతం 2,434కు పెంపుదల చేసామని పేర్కొన్నారు. పోస్ట్ కోవిడ్ చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి నెలకు రూ. 5 వేల వరకు ఆరోగ్య ఆసరా క్రింద అందిస్తున్నామని, అన్ని రకాల కేన్సర్ లను, బోన్ మారో చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం జరిగిందని వివరించారు. గతంలో ఉన్న రూ.680 కోట్లు బకాయిలను ఆసుపత్రులకు చెల్లించామని చెప్పారు. అధికారులు ఆరోగ్య శ్రీ అమలును చక్కగా అమలు చేస్తూ ప్రతి ఒక్కరూ లబ్ది పొందుటకు సహకరించాలని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రలు ఉండాలని స్పష్టం చేసారు. ఆరోగ్య శ్రీ అమలును జాయింట్ కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు. చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా విధిగా అందాలని అన్నారు. శ్రీకాకుళం జెమ్స్ నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 2434 వ్యాధులకు చికిత్స ప్రారంభించడం ముదావహం అన్నారు. జిల్లాలో 2018 నుండి 72,570 మంది చికిత్సలు జరిగాయని, ఇందుకు రూ.179 కోట్లు ఖర్చు జరిగిందని వివరించారు. ఆరోగ్య ఆసరా క్రింద 2019 డిశంబరు నుండి ఇప్పటి వరకు 12,701 మంది లబ్దిపొందారని, వారికి రూ.7.90 కోట్లు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. డా.వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ క్రింద లబ్దిపొందిన జలుమూరు మండలం కరకవలసకు చెందిన మీసాల కృష్ణ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల తన కుమార్తై సంజన ఆడుతూ పడిపోయిందని, ఎడమ కాలు వాపు వచ్చిందని అన్నారు. వివిధ ఆసుపత్రులకు తీసుకువెళ్లామన్నారు. పూర్తి చికిత్సకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో తాపి మేస్త్రీగా పనిచేస్తున్న నేను ఏమి చేయాలో తెలియక మనస్ధాపం చెందామని అన్నారు. అయితే తమ గ్రామ వాలంటీరు ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందవచ్చని సూచించడంతో జెమ్స్ ఆసుపత్రిలో చేరామని చెప్పారు. పది రోజులుగా చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం ఆరోగ్య మెరుగుపడుతుందని తెలిపారు. జగనన్న ముఖ్య మంత్రిగా అనేక పథకాలు అందిస్తున్నారని అందులో తన కుమారునికి అమ్మ ఒడి అందిందని, తండ్రికి పింఛను అందుతుందని అన్నారు. జగనన్న ముఖ్య మంత్రిగా ఉండటం పేద ప్రజల పాలిటి అదృష్టమని కొనియాడారు. నీ పేరు చెప్పుకుని చక్కని ఆరోగ్యంతో ఆనందంగా ఉండగలమని కృష్ణ అన్నారు. ఆమదాలవలసకు చెందిన పిల్లా చిన్నారావు మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ ప్రజల పాలిట వరమన్నారు. డా.వై.యస్.ఆర్ శ్రీకారం చుట్టిన ఈ పథకానికి మరిన్ని వ్యాధులను జోడించి ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నావని అన్నారు. తనకు ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, అయితే పేదరికంలో ఉన్న నాకు వాలంటీరు సహాయంతో ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, డిఎంహెచ్ఓ డా.కె.సి.చంద్ర నాయక్, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ రవి కిషోర్, జెమ్స్ కోవిడ్ సూపరింటెండెంట్  డా.హేమంత్, డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, డిఎంహెచ్ఓ డా.కె.సి.చంద్ర నాయక్, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ రవి కిషోర్, జెమ్స్ కోవిడ్ సూపరింటెండెంట్  డా.హేమంత్, డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.