ప్రభుత్వ భవనాలకు గ్రౌండింగ్ చేయాలి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-10 17:56:18

అనంతపురం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాలను తక్షణం గ్రౌండింగ్ చేయాలని, బుధవారం లోపు పూర్తి స్థాయిలో అన్ని భవనాలను గ్రౌండింగ్ చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం నగరంలోని సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి పంచాయతీ రాజ్ ఎస్ఈ మహేశ్వరయ్య, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరే రామ్ నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ శోభ స్వరూపరాణి, డీఈవో శామ్యూల్, తహసీల్దార్ లు, ఎంపీడీవోలు, మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాల గ్రౌండింగ్ ను ఒక ఛాలెంజ్ గా తీసుకొని బుధవారం లోపు అన్ని భవన నిర్మాణాలు గ్రౌండింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి జిల్లాలో స్థలం సమస్య ఉందనే మాట ఎక్కడా రాకూడదని, ఎక్కడ గ్రౌండింగ్ చేయకపోతే ఆయా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడమన్నారు. ఆయా భవనాల గ్రౌండింగ్ విషయమై క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని, ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్క గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాల గ్రౌండింగై ఉండాలని, గ్రౌండింగ్ చేయకుండా ఏదైనా సాకులు చెప్పినా వినేది లేదన్నారు. అనేక పర్యాయాలు చెప్పినా సీరియస్ గా  తీసుకోకుండా, తప్పుడు లెక్కలు చూపించారని, గ్రౌండింగ్ విషయమై ఒక ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా గ్రౌండ్ చేయాల్సినవి ఉన్నాయని, నాలుగు గుంతలు తీసి గ్రౌండింగ్ చేశామని చూపిస్తున్నారని, ఇది ఒప్పుకోమన్నారు. తప్పనిసరిగా వెంటనే అన్ని భవనాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు చేపట్టాలని, ఇందుకు సంబంధించి అవసరమైన మెటీరియల్ సిద్ధం చేసుకుని పనులు చేపట్టాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్ ఇలా ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి పనులు చేపట్టేలా చూడాలన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయ భవనాలకు సంబంధించి 14 చోట్ల ఇంకా గ్రౌండింగ్ చేయలేదని, 28 రైతు భరోసా కేంద్రాల భవనాలు, 32 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ సంబంధించి ఇంకా గ్రౌండింగ్ చేయాల్సి ఉందని, 6 నెలల నుంచి చెబుతున్నా ఇంకా ఆయా భవనాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు చేపట్టక నిద్రపోతున్నారా అంటూ కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అన్ని చోట్ల గ్రౌండింగ్ చేపట్టి పనులు చేట్టాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే జిల్లాపరిషత్ సిఇఓ, డిపిఓ, ఎంపీడీవో, పంచాయతీ సెక్రెటరీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, పంచాయతీ సెక్రటరీ లు ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకుని పనులు చేపట్టాలన్నారు. ఆయా భవనాలకు సంబంధించి స్థలం సమస్య ఉంటే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పని చేసి సమస్యను పరిష్కరించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆయా భవనాలను పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. గ్రౌండింగ్ అంటే గుంత తీసి వదిలేయడం కాదని, పునాదులు వేయడం, పిల్లర్లు ఏర్పాటు చేయడం లాంటి పనులు జరిగేలా చూడాలన్నారు. బుధవారం లోపు వచ్చే 24 గంటల్లో ఎంత మేరకు అయితే అంతమేరకు పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  అనంతపురం రూరల్ పరిధిలోని సోమలదొడ్డి గ్రామంలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కి సంబంధించి స్థలం అప్పగించకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని సంబంధిత తహసీల్దార్ ను కలెక్టర్ ప్రశ్నించారు. బుధవారం లోపు స్థలం సమస్య పరిష్కరించి ఆయా భవనాలకు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సింగనమల మండలంలోని ఉలికల్లు గ్రామంకు సంబంధించి ఉలికంటిపల్లి గ్రామంలోనైనా స్థలం చూపించి ఆయా భవనాలను గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసీల్దార్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చెన్నేకొత్తపల్లి మండలం లోని మేడాపురం గ్రామంలో గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి సంబంధించి 8 నెలల నుంచి చెబుతున్న ఎందుకు గ్రౌండింగ్ చేయలేదని ఎంపీడీవో ని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి స్థలం ఎందుకు చూపించలేదని తహసీల్దార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే గ్రౌండింగ్ చేపట్టి పనులు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  నల్లచెరువు కు సంబంధించి ఇప్పటివరకు ఏజెన్సీని ఫైనలైజ్ చేయకపోవడం తగదని, వెంటనే స్థలం సమస్య పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక ఛాలెంజ్ గా తీసుకుని గుంతలు తీయడం, ఇతర పనులు చేపట్టడం చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలకు  సంబంధించి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆయా భవన నిర్మాణ పనులను మంగళవారం రాత్రి, బుధవారం పగలు, రాత్రి చేపట్టాలన్నారు.  ఆయా భవన నిర్మాణాలకు సంబంధించి  ఆర్ డి వో లు, సబ్ కలెక్టర్ వారి డివిజన్ పరిధిలో  మానిటర్ చేస్తూ అన్ని పనులు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానిపై జిల్లా పరిషత్ సీఈఓ, డి పి వో లు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా సచివాలయం పరిధిలో సేవలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. నాడు - నేడు పనులను పూర్తి చేయాలి: జిల్లావ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న నాడు-నేడు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాడు నేడు పనులపై డీఈఓ, ఎం ఈ ఓలు ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపట్టాలని, వెంటనే నాలుగు నుండి పనులపై సమీక్ష నిర్వహించి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్య 9, 10వ తరగతి విద్యార్థులు వారికి కేటాయించిన యూనిఫామ్ లోనే పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.