అలాంటి కళాశాలలను మూసేస్తాం..


Ens Balu
2
Srikakulam
2020-11-10 19:08:14

శ్రీకాకుళంజిల్లాలో కరోనా నియమ నిబంధనలు పాటించని ప్రైవేటు కళాశాలలను మూసివేస్తామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కళాశాల యాజమాన్యాలను హెచ్చరించారు. కరోనా నేపధ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలతో సమీక్షా సమావేశం స్థానిక బాపూజీ కళామందిర్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు నవంబర్ 2 నుండి కళాశాలలు ప్రారంభమయ్యాయని, అయితే కొన్ని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్ధులు కరోనా నిబంధనలు పాటించడం లేదనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. దీనివలన మరలా కరోనా ప్రబలే అవకాశం ఉందని స్పష్టం చేసారు. ప్రతీ జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కరోనా నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని, నిబంధనలు పాటించని కళాశాలలను మూసివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతీ కళాశాలలో 33 శాతం మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని, మిగిలిన వారిని ఈ క్రమంలోనే తదుపరి తేదీల్లో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ తరగతి గదిలో 16 మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని, ఎక్కువ మంది విద్యార్ధులు ఉన్నట్లయితే అదనపు తరగతి గదులను ఏర్పాటుచేయాలని సూచించారు. ఇరుకు గదుల్లోనూ, తక్కువ ప్రదేశంలో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ విద్యార్ధి మాస్కు, శానిటైజర్ విధిగా వినియోగించేలా ఉండాలని, కళాశాల వెలుపల శానిటైజేషన్ చేసి లోపలకు పంపాలని సూచించారు. విద్యార్ధులు లోపలకు ప్రవేశించే సమయంలో 6 అడుగుల సామాజిక దూరం పాటించాలని, కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసారు. కళాశాల వెలుపలకు వచ్చే మార్గాలు విశాలంగా ఉండాలని అన్నారు మరుగుదొడ్లు, తరగతి గదులను ఎప్పటికపుడు హైపోక్లోరైడ్ తో శుభ్రం చేస్తుండాలని సూచించారు. దూర ప్రాంతాల నుండి రెండు, మూడు వాహనాలు మారి వచ్చే విద్యార్ధులను అనుమతించరాదని, అటువంటి వారి కోసం ప్రత్యేక విద్యాబోధన ఏర్పాటు చేయాలని తెలిపారు. వీలైనంత వరకు ఆన్ లైన్ తరగతులకు ప్రాధాన్యతను ఇవ్వాలని, యూట్యూబ్, వీడియో, వాట్సాప్ ద్వారా తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా కరోనా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కరోనా లక్షణాలతో విద్యార్ధులు హాజరైతే తక్షణమే తమకు సమాచారం అందించాలని, అటువంటివారికి తక్షణమే పరీక్షలు నిర్వహించి వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి అయ్యేవారి వివరాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. దీనివలన కరోనాను నియంత్రించే అవకాశం కలుగుతుందని చెప్పారు. కరోనా సమాచారం తెలియజేయడం వలన తమ కళాశాలను మూసివేస్తారనే అపోహ కళాశాల యాజమాన్యాలకు వద్దని కలెక్టర్ స్పష్టం చేసారు. అలాకాకుండా కరోనా లక్షణాలు గల విద్యార్ధుల సమాచారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే అటువంటి కళాశాలలను తక్షణమే మూసివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతీ కళాశాలను సంయుక్త కలెక్టర్, ప్రాంతీయ తనిఖీ అధికారి ( ఆర్.ఐ.ఓ ), తహశీల్ధార్, సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారని, తనిఖీలో కరోనా వివరాలు బయటపడితే అటువంటి కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అస్త్మా, గుండె సమస్యలు, డయాబెటిక్, కోమా డిజార్డర్ ఉన్నవారిని కళాశాలలకు అనుమతించరాదని, తల్లితండ్రుల అనుమతితోనే విద్యార్ధులు కళాశాలలకు హాజరుకావాలని కలెక్టర్ వివరించారు. ప్రతీ రోజూ కళాశాలకు హాజరయ్యే విద్యార్ధుల వివరాలను తమకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గత 8 మాసాలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రజలు సహకరించడం వలనే గత 2 మాసాలుగా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం పూర్తి లాక్ డౌన్, దుకాణాల సమయాలను తగ్గించడం వలన కరోనా కేసులు బాగా తగ్గాయని, ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో రోజుకు 10 కన్నా తక్కువ కేసులే నమోదు అవుతున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు.  ఈ విధమైన చర్యలు ప్రజలు మంచికోసమే అని అందరూ భావించాలని, కావున కళాశాల యాజమాన్యాలు తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు  కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నియంత్రణకు సహకరించాలని, ఇందులో ఎటువంటి అలసత్వం వహించరాదని కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, ప్రాంతీయ తనిఖీ అధికారి ఆర్.రుక్మాంగధరరావు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.