ఎయిర్ పోర్టుకి భూసేకరణ వేగవంతం చేయాలి..
Ens Balu
1
కలెక్టరేట్
2020-11-10 19:25:40
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేపట్టిన భూసేకరణలో తలెత్తిన సమస్యలను అధిగమించి, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పరిశ్రమలు,పెట్టుబడులు, మౌళిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ భూసేకరణపై సంబంధిత అధికారులతో భోగాపురంలో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు కోసం ఇప్పటివరకు మొదటి విడతలో 2,631 ఎకరాలు, రెండో విడతలో 103 ఎకరాలను సేకరించడం జరిగిందన్నారు. మూడో విడతగా ట్రంపెట్ వంతెన కోసం మరో 102.79 ఎకరాలను సేకరిస్తున్నామన్నారు. 1383.39 ఎకరాల జిరాయితీ భూమికి గానూ, ఇప్పటివరకు 1245.92 ఎకరాలను సేకరించడం జరిగిందన్నారు. 825.55 ఎకరాల అసైన్డ్ లేండ్‌కు గానూ, ఇంకా 320 ఎకరాలు పెండింగ్‌లో ఉందన్నారు. మిగిలిన భూముల సేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. సుమారు 300 ఎకరాలు పోటా భూములకు సంబంధించి వివాదాలు కోర్టులో ఉన్నాయని చెప్పారు. వీటిని ఆయా కేసుల వారీగా విశ్లేషించి, బుధవారం నాటికి సమగ్ర నివేదికను తయారు చేయాలని స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లను ఆదేశించారు. ఎయిర్‌పోర్టుకు ఎంత త్వరగా భూసేకరణ పూర్తి చేస్తే, అంత త్వరగా నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్, ఎపి ఏవియేషన్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు కెబిటి సుందరి, ఎస్.వెంకటేశ్వర్లు, హెచ్‌వి జయరామ్, తాశీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.