ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-11-10 19:30:31
విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన గోడౌన్ల ఏర్పాటు, గోనె సంచులు , మిలర్ల టాగింగ్ , హమాలీలు, రవాణా కు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 3 వ వారం నాటికీ పంట వస్తుందని, పంట సేకరణ ఒక పండగలా జరగాలని అన్నారు. మంగళవారం అయన ఛాంబర్ లో మిల్లర్లు, పౌర సరఫరా, మార్కెటింగ్, వ్యవసాయ, భారత ఆహార సంస్థ అధికారులతో దాన్యం సేకరణ ఏర్పాట్ల పై సమీక్షించారు. జిల్లాలో వెలుగు బృందాలు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, డి సి ఎం ఎస్ , గిరి వెలుగు, రైతు బృందాలు, వ్యవసాయ మార్కెట్ కమిటి ల ద్వారా కొనుగోలు చేయుటకు 263 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సేకరణ కేంద్రం రైతు భరోసా కేంద్రానికి మాపింగ్ జరగాలని అన్నారు. ఇంతవరకు 558 రైతు భరోసా కేంద్రాల్లో 14 వేల 992 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారం లోగా మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలను ఇవ్వాలని డిసిసిబి అధికారులకు తెలిపారు. ప్రతి ధాన్యం సేకరణ కేంద్రం దగ్గరలో నున్న రైస్ మిల్లునకు ట్యాగ్ అయ్యేలా చూడాలని జిల్లా పౌర సరఫరాల అధికారికి సూచించారు. భారత ఆహార సంస్థ మిల్లర్లకు దగ్గరగా ఉన్న చోట తమ గోడౌన్ లలో ఎక్కువ స్థలాన్ని కేటాయించాలని కోరారు. దూరంగా ఉన్న గోడౌన్ లకు రవాణా చేయడానికి రవాణా ఖర్చుల భారం పెరుగుతోందన్న మిల్లర్ల విజ్ఞప్తిని దృష్టి లో పెట్టుకొని దగ్గరగా ఏర్పాటు చేయాలన్నారు .
అక్రమ రవాణా పై గట్టి నిఘా : ధాన్యం పక్క దారి పట్టకుండా, అక్రమ రవాణా అరికట్టడానికి చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచాలని రవాణా శాఖాధికారులకు ఆదేశించారు. సేకరణ కేంద్రాల నుండి డిజిగ్నేట్ చేసిన రైస్ మిల్లులకు రవాణా చేసే వాహనాల వివరాలను ధాన్యం సేకరణ కేంద్రాల పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.ధాన్యం సేకరణ పై విస్తృత ప్రచారం: ప్రతి రైతు భరోసా కేంద్రం , దాన్యం సేకరణ కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ బ్యానర్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందు కోసం ప్రతి ప్రోక్యూరింగ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా వెంటనే డేప్యుట్ చేయాలని అన్నారు. రైతులందరికీ తెలిసేలా గ్రామాల్లో ప్రచారం గావించాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వరకుమార్, మార్కెటింగ్ శాఖ ఎ.డి శ్యాం కుమార్, వ్యవసాయ , భారత ఆహార సంస్థ శాఖల అధికారులు , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొండబాబు, శ్రీరామ్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.