ప్రభుత్వం విద్యకే తొలిప్రాధాన్యత ఇస్తుంది..
Ens Balu
3
Srikakulam
2020-11-11 14:50:44
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యతను ఇస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ విద్యార్ధి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా ఎటువంటి సాంకేతికత లేని రోజుల్లోనే రాబోయే తరాలకు ఉన్నత విద్యను అందించేందుకు కృషిచేసిన మహోన్నత వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. ఇదే తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి తరానికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో విద్యకు, వైద్యానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్న సంగతిని జె.సి గుర్తుచేసారు. అందులో భాగంగానే నాడు-నేడు పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతున్నాయని, త్వరలో వాటిని విద్యార్ధులు వీక్షించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యాకానుక పేరుతో ప్రతి విద్యార్ధికి స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, షూప్, బెల్ట్, షాక్సులు, యూనిఫారాం వంటివి పంపిణీచేయడం జరిగిందని చెప్పారు. నాణ్యమైన భోజనం, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటివి అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార దృష్టితో చూస్తాయని, కానీ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలనే తపనతో ఉంటాయని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థల కంటే మెరుగైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటారనే విషయం గుర్తించాలన్నారు. అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల ముందుచూపును గ్రహించి విద్యార్ధులందరూ రోల్ మోడల్ గా ఉండాలని జె.సి ఆకాంక్షించారు. ప్రభుత్వం పంపిణీచేసిన యూనిఫారాలు ధరించి విద్యార్ధులు రావడం ఆనందంగా ఉందని, ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందిస్తున్నట్లు జె.సి పేర్కొన్నారు. తొలుత అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించిన జె.సి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖాధికారి కుసుమ చంద్రకళ మాట్లాడుతూ సృజనాత్మకత, నాయకత్వం, ఉపాధికల్పన, వ్యవస్థాపకత వంటివి విద్యతోనే లభిస్తాయని కలాం ఆశించారని, అందుకే విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. భారత ప్రభుత్వంలో తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు నిర్విరామంగా పనిచేసిన మహనీయుడు కలాం అని కొనియాడారు. విద్యావ్యవస్థలో పలుమార్పులను తీసుకువచ్చిన గొప్ప దార్శనీకుడు కలాం అని అన్నారు. మన విద్యావ్యవస్థ ఇతర దేశాల్లో తలమానికంగా ఉండేందుకు ఆయనే మూలకారణమనే విషయాన్ని విద్యార్ధులు గుర్తెరగాలని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధులు నడుచుకొని, మంచి విద్యను అభ్యసించి మంచి విద్యావేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రోజెక్ట్ అధికారి పైడి వెంకటరమణ, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యం.వాగ్దేవి, ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, తల్లితండ్రుల కమిటీ చైర్మన్ మామిడి సూర్యప్రసాద్ దొర, ఉపాధ్యాయులు పి.వి.జయరాం, ఎ.బి.వీరాంజనేయులు, సిహెచ్.అభిమన్యరాజు, యన్.షణ్ముఖరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.