ఘనంగా గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ..
Ens Balu
4
Srikakulam
2020-11-11 15:09:06
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణ బుధవారం ఘనంగా జరిగింది. జిల్లా ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసిన కిమ్స్ రహదారిలో సింహద్వారం దగ్గరలో ఇంటాక్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించి విగ్రహావిష్కరణ చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గొర్లె శ్రీరాములు నాయుడు తిరుగులేని ప్రజానాయకుడుగా, శ్రీకాకుళం కీర్తిప్రతిష్టలను రాష్ట్రం మొత్తం చాటి చెప్పిన వ్యక్తిగా నిలిచారన్నారు. రాజకీయాల్లో ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. శాసనమండలి సభ్యులుగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా ఆయన పనితీరును ఇప్పటికీ అందరూ గొప్పగా చెప్పుకుంటారని పేర్కొన్నారు. నిస్వార్ద, నిష్కలంక, సమర్దవంతమైన నాయకునిగా పేరుగాంచారని, అనేక పాఠశాలలు స్దాపించి విద్యాప్రదాతగా నిలిచారని, మడ్డువలస జలాశయ సాధనలో కీలక పాత్ర పోషించారని, తోటపల్లి జలాశయ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయింపు చేసారని, మారుమూల ఆవాసాలకు సైతం రహదారులను కల్పించారని, రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల విద్యార్ధులకు సంక్షేమ వసతి గృహాలు ప్రారంభించారని, వందలాది గ్రామాలకు తాగు నీటి కల్పనకు కృషి చేసారని, రైతు సహకార రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ గొర్లె శ్రీరాములు నాయుడు అనేక మందికి రాజకీయ గురువు అన్నారు.1959 వ సంవత్సరంలో కోటపాలెం సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నికతో రాజకీయ ప్రస్ధానం ప్రారంభించి, అదే సంవత్సరంలో రణస్ధలం నాన్ బ్లాక్ (సమితి) ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. 1964 సంవత్సరంలో రణస్ధలం సమితి అధ్యక్షునిగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికై, అదే సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని తెలిపారు. 1974 సంవత్సరంలో ఆర్.టి.ఏ సభ్యులుగాను, 1975లో డిసిసిబి ఛైర్మన్ గాను, 1976లో ఎం.ఎల్.సిగా ఎన్నికయ్యారని, 1979లో రాష్ట్ర చిన్న నీటిపారుదల, వెనుకబడిన తరగతులు శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, 1981లో రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. 1981లోనే మంత్రి పదవికి రాజీనామా చేసి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షులుగా 18 ఏళ్ళపాటు సుదీర్ఘకాలం జిల్లాకు సేవలు అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన మామిడి శ్రీకాంత్, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్, సభ్యులు జగన్నాథం నాయుడు, మాజీ మునిసిపల్ చైర్మన్ ఎం. వి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.