కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకోవద్దు..


Ens Balu
3
Srikakulam
2020-11-11 18:33:54

శ్రీకాకుళం జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకోవద్దని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యల వలన ప్రస్తుతానికి తక్కువ కేసులు వస్తున్నాయని అయితే రానున్న మూడు నెలల కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పూర్తి సురక్షిత చర్యలు చేపట్టాలని, కోవిడ్ భారీన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. కళాశాలలు ప్రారంభిస్తున్న దృష్ట్యా డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులతో బుధ వారం బాపూజీ కళామందిర్ లో కరోనా అప్రమత్తతపై తీసుకోవలసిన చర్యలపై డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ పాల్గొని మాట్లాడుతూ కరోనా భారీన పడకుండా సురక్షిత జాగ్రత్తలు పాటించడం అత్యావశ్యమన్నారు. కళాశాలల్లో కరోనా వ్యాప్తి కాకుండా ప్రధానాచార్యులు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తరగతిలో మూడవ వంతు విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని, తరగతి గదిలో 16 మంది మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేసారు. శానిటైజేషన్ చేయుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధులకు కళాశాలలకు అనుమతించరాదని, ఆన్ లైన్ లొనే తరగతులు నిర్వహించాలని సూచించారు.  కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్ధి సొంతంగా శానీటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకునే విధంగా సూచించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్ధి విధిగా మాస్కు ధరించాలని అన్నారు. కళాశాలకు వచ్చే స్ధానిక విద్యార్ధులు మాస్కు ధారణ కరోనా వ్యాప్తి కాకుండా రక్షణ కవచంలా పనిచేస్తుందని సత్యాన్ని గ్రహించాలని అన్నారు. భౌతిక దూరం పాటించాలని అన్నారు. విద్యార్ధులు గుమిగూడకుండా తగిన సూచనలు జారీ చేయాలని తద్వారా కరోనా వ్యాప్తి కాకుండా చూడవచ్చని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్ధిని తరగతులకు అనుమతించరాదని స్పష్టం చేసారు. కరోనా లక్షణాలు కలిగిన వారు ఉంటే తక్షణం సమాచారం అందించాలని ఆదేశించారు. అటువంటి వారిని వెంటనే పరీక్షించుటకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. పాజిటివ్ వచ్చినా కళాశాల మూసివేయడం జరగదని పేర్కొంటూ లక్షణాలు గుర్తించడంలో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. తద్వారా వ్యాప్తికి కారణం అవుతారని బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కరోనా వ్యాప్తి పెరుగుతుందని గుర్తించాలని కలెక్టర్ అన్నారు. సదుపాయాలు లేని కళాశాలకు తరగతులు నిర్వహించుటకు అనుమతి లేదని అన్నారు. ప్రాణాలు ముఖ్యమని పేర్కొంటూ అధ్యాపకులు అన్ని సురక్షిత చర్యలు తీసుకోవాలని కోరారు. తహసీల్దార్లు కళాశాలలను తనిఖీ చేసి సదుపాయాలపై నివేదికలు సమర్పిస్తారని తెలిపారు. కళాశాలలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ఎటువంటి వ్యాప్తి లేకుండా చూస్తూ విద్యార్ధులకు విలువైన విద్యా సంవత్సరం కొనసాగుటకు తోడ్పడాలని అన్నారు. అధిక వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో సతమతమయ్యే వారు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.  పర్యావరణహిత దీపావళి వేడుకలు కావాలి : జిల్లాలో దీపావళి వేడుకలు పర్యావరణహితం కావాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. దీపావళిలో పర్యావరణహిత టపాసులు (గ్రీన్ క్రేకర్స్)కు మాత్రమే ప్రభుత్వం అనుమతించిందని అన్నారు. సాధ్యమైనంతవరకు దీపావళికి దూరంగా ఉంటే మేలు అని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొ. కూన రాంజీ, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రో.కె.రఘుబాబు, కళాశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.