మ‌త్స్య సంప‌ద యోజ‌న ద్వారా ఎంతో లబ్ది..


Ens Balu
3
Machilipatnam
2020-11-11 18:59:10

మ‌త్స్యకారుల‌కు మార్కెటింగ్ పై అవ‌గాహ‌న లేక ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని ఈ రంగంలో మ‌రిన్ని స‌దుపాయాలు పెంపొందించేందుకు  పిఎం మ‌త్స్య సంప‌ద యోజ‌న ద్వారా ఎంతో లబ్ది చేకూరనున్నట్లు  రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం కృష్ణాజిల్లాలోని 377 మత్స్య సహకార సొసైటీ లకు చెందిన అధ్యక్షులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో  మత్స్య రంగ సమగ్ర అభివృద్ధి  నీలి విప్లవం సాధించేందుకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)’  వివరించారు. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 20,050 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని  నిర్ణయించారని,  ఇందులో కేంద్ర వాటా రూ. 9,407 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ. 5763 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకాన్ని 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల పాటు అమలు చేయనున్నారు . కృష్ణాజిల్లాకు రూ. 15. 68 కోట్లు ఈ ఏడాదికి కేటాయించారు. మత్స్య ఉత్ప‌త్తి, ఉత్పాద‌క‌త , నాణ్య‌త‌, సాంకేతిక‌త‌, పంట అనంత‌ర మౌలిక స‌దుపాయాలు, యాజ‌మాన్యం, ఆధునీక‌ర‌ణ‌ గురించి అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని  377 మత్స్య సహకార సంఘాల అధక్షులు, ఉపాధ్యక్షులతో పలు అంశాలపై సమగ్రంగా చర్చించి నేరుగా వారి నుంచి   అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు.              నూతన మంచినీటి చేపల హేచరీల ఏర్పాటు,  అవసరానికి అనుగుణంగా కొత్త ఉప్పునీటి చేపలు, రొయ్యల హేచరీల ఏర్పాటు, ఉప్పు నీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం సాగు ఖర్చు,  మంచినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం సాగు ఖర్చు, రిజర్వాయర్లలో చేప పిల్లల స్టాకింగ్ , రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టం ఏర్పాటు, సముద్రజలాల్లో , నాదీ ముఖద్వారాల వద్ద పంజరాలు ( కేజెస్ ) ఏర్పాటు, రిజర్వాయర్లలో పంజరాల ( కేజెస్ ) ఏర్పాటు, ఐస్ పెట్టె తో సహా మోటార్ సైకిళ్ళు , సంప్రాదాయ మత్స్య కారులకు లోతు సముద్ర జలాలలో వేటచేసే మరబోట్లు పొందడానికి తోడ్పాటు, సముద్ర వేట చేసే బోట్లలలో బయో టాయిలెట్ల ఏర్పాటు, ఆక్వాలో వ్యాధి నిర్ధారణ పరీక్షా సంచార లాబొరేటరీలు,  ఆక్వా క్లినిక్ ల ఏర్పాటు, మత్స్యకారులకు పాతబొట్ల స్థానాన్నే కొత్త బొట్లు, వలల ఏర్పాటు, జిల్లా మత్స్య ఉత్పత్తిదారుల మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేసే చేపల వాణిజ్య హబ్ లకు అనుసంధానంగా చేపలు రొయ్యల వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కొరకు యూనిట్ల వివరాలు, బతికి ఉన్న చేప పిల్లల విక్రయ కేంద్రాలు, చేపల అమ్మకాలకు ఐస్ పెట్టెతో సహా మూడు చక్రాల ఆటోలు , ఈ - రిక్షాలు , రిటైల్ చేపల మార్కెట్ల ( హబ్ ) నిర్మాణం, చేపల దుకాణాలు , చేపల అదనపు విలువ జోడించే పప్పు రొయ్యి , పండుగప్ప , రొయ్యల పచ్చళ్ళు ద్వారా వ్యాపార కేంద్రాలు తదితర అంశాలపై చక్కని అవగాహన కల్పించారు.   ఈ సమావేశంలో మచిలీపట్నం మాజీ జడ్పిటీసి, మచిలీపట్నం బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ), కృష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ , జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు గోవిందరాజులు , మచిలీపట్నం, గుడివాడ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్లు రాధాకృష్ణ , నాగలింగాచారి తదితరులు పాల్గొన్నారు.