రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..
Ens Balu
2
శ్రీకాకుళం
2020-11-12 13:28:38
ఖరీఫ్ సీజన్ లో రైతులకు గిట్టుబాటు ధరను అందించి, వారిని సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది పనిచేయాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. రైతుల వివరముల నమోదు, ధాన్యం నాణ్యత, ధాన్యం రకాలు, ధాన్యం కొనుగోలు విధానంపై గురువారం గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం స్థానిక సన్ రైజ్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 1 లక్ష 75 వేల మంది రైతులు ఉన్నారని, వీరిద్వారా ఖరీఫ్ సీజన్ లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం నాణ్యతను పరిశీలించి, సరైన గిట్టుబాటు ధరను అందించి రైతులు సంతోషంగా కొనుగోలు కేంద్రాల నుండి తరలివెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. రైతుల రిజిస్ట్రేషన్, రీషెడ్యుల్, రైస్ మిల్లర్ల వివరాలు , సార్టెక్స్ , నాన్ సార్టెక్స్ వంటి తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు. ధాన్యం సేకరణకు ఇంకా 15 రోజుల వ్యవధి ఉన్నందున మీ పరిధిలోని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్.బి.కెల ద్వారా ధాన్యం కొనుగోలు రిజిస్ట్రేషన్ దగ్గర నుండి నగదు చెల్లింపులు వరకు జరిగే ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఇందుకు గ్రామ వ్యవసాయ సహాయకులు ముందుగా ఈ నిర్వహణపై క్షుణ్ణంగా తెలుసుకోవాలని జె.సి వివరించారు. జిల్లాలో 70 శాతం మంది రైతులు ధాన్యంపైనే ఆధారపడి ఉన్నారని, కావున గ్రామ వ్యవసాయ సహాయకులు మిల్లర్ల వైపు నుండి కాకుండా రైతుల నుండి ఆలోచన చేయాలని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్న సంగతిని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. రాష్ట్రస్థాయి అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేపడుతున్న చర్యలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, అలక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని జె.సి ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, ప్రత్యేక ఉపకలెక్టర్ శైలజ, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబర్ట్ పాల్, రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. సత్యనారాయణ, శిక్షకులు సహాయ మేనేజర్ ( టెక్నికల్ ) శిరీష, నీలిమ, సహాయ మేనేజర్ ( జనరల్ ) నరేంద్రబాబు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.