నరేగా నిధులు పూర్తిగా వినియోగించాలి..


Ens Balu
1
కలెక్టరేట్
2020-11-12 20:25:06

శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద సమకూరుతున్న నిధులు శత శాతం సద్వినియోగం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనకు విచ్చేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు చినతాతయ్యలతో కలసి సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ క్రింద నిధులు అధిక మొత్తంలో సమకూరుతున్నాయని, వాటిని వినియోగించుకుని వివిధ పనులు చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేసామని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ భవనాలు, హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, సిసి రహదారులు, మురుగుకాలువలు తదితర పనులను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిధులు పూర్తి స్ధాయిలో వినియోగానికి తమ వంతు సహకారం ఉంటుందని చినతాతయ్యలు చెప్పారు. సకాలంలో సిమెంటు, ఇతర సామగ్రి అందాలని అందుకు ప్రధాన కార్యాలయం నుండి తగు సమన్వయం చేయడం ద్వారా సాధ్యం కాగలదని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంజనీర్లు తెలిపారు.            ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ కమీషనర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్.కూర్మారావు, గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాస రావు, పంచాయతీరాజ్ ఇన్ ఛార్జ్ పర్యవేక్షక ఇంజనీరు కె.ఎం.వి.ప్రసాద రావు, ఇడబ్యుఐడిసి, గిరిజన సంక్షేమ శాఖ, సమగ్ర శిక్షా అభియాన్ కార్యనిర్వాహక ఇంజనీర్లు వరుసగా కె.భాస్కర రావు, జి.మురళి, వి.వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.