విద్యాసంస్కరణలకు అబుల్ కలాం మార్గదర్శి..
Ens Balu
2
Kaikaluru
2020-11-12 21:10:55
భారతదేశపు తొలి విద్యాశాఖామంత్రిగా విద్యలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన గొప్ప మానవతవాది, రచయత, బహు భాషా కోవిదులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాదేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. గురువారం బుడ్డా సాహెబ్ ఛారిటబుల్ ట్రస్ట్ కైకలూరు ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో భాగంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అబుల్ కలాం విద్య రంగానికి చేసిన కృషిని స్పూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అనేక పథకాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. నాడు-నేడు పధకం ద్వారా పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరచడం, విద్యార్ధులకు పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర సౌకర్యాలతో పాటు అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తూ విద్యకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు కృషి చేయడమే కాక ఎన్నో విప్లవాత్మక విద్యా సంస్కరణలను అమలుపరిచేందుకు మౌలానా అబుల్ కలాం ఆజాదే అంకిత భావంతో పనిచేశారన్నారు . చిన్నపిల్లల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాాణానికి జాతీయ కార్యక్రమాన్ని ప్రణాళికను రూపొందించి 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారని మంత్రి పేర్ని నాని వివరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బుడ్డా సాహెబ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాలిబ్ బాబు , 15 వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ రఫీ , అనీస్, రెహమాన్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.