ఇంటి ముంగిటే న్యాయాన్ని అందిస్తాం..


Ens Balu
3
శ్రీకాకుళం
2020-11-12 22:06:24

ఇంటి ముంగిటికే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు.  గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమీషన్ సంయుక్తంగా  మహిళలకు న్యాయవిజ్ఞానంపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం  జిల్లా న్యాయ సేవాధికార అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ, జిల్లా కలెక్టర్ జె నివాస్ తో కలసి ఐ సి డి ఎస్ రూపొందించిన పిల్లల దత్తతకు సంబంధించిన  పోస్టర్ ను  విడుదల చేసారు.  ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ,  ఇంటి వద్దకే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, మండల ప్రధాన కేంద్రాలు, గ్రామ స్థాయిలలోని మూరుమూల ప్రాంతాలలో సైతం మహిళా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.  హిందూ వివాహ చట్టంపైన, ఎస్.సి, ఎస్.టి.  అట్రాసిటీ కేసులు, మహిళలకు ఆస్తి హక్కులు తదితర  అంశాలను క్షుణ్ణంగా వివరించారు. 18 సం.ల లోపు వయస్సు గల ఆడపిల్లలను వివాహం చేసుకున్న 21 సం.లు దాటిన మగపిల్లవాడు కూడా శిక్షార్హుడని తెలిపారు.  పుట్టుకతోనే ఆడపిల్లకు ఆస్తిహక్కు సంక్రమిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు చట్టాలపై అవగాహన లేకపోవడం ద్వారా హక్కులు, న్యాయాన్ని పొంద లేక పోతున్నారన్నారు. ఎస్ సి ఎస్. టి అట్రాసిటీ కేసులో బాధితులకు కంపెన్సేషన్ వస్తుందని చెప్పారు. ముందుగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకోవాలని, ఆతేదీ నుండి నష్టపరిహారాన్ని పొందవచ్చునని తెలిపారు.  బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస వంటి చట్టాలపై అవగాహన కలిగివుండాలన్నారు.   న్యాయాన్ని ఎవరి ద్వారా పొందాలి, ఎక్కడ పొందాలి అనే విషయాలు  ముందుగా తెలుసు కోవాలన్నారు.  మహిళల  పరిరక్షణ  కోసం   గ్రామ స్థాయిలో  ని మహిళా పోలీస్ ల నియమించడం జరిగిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో   బాగా పని చేస్తున్నారని  కరోనాను అరికట్టడంలో మహిళలు ప్రముఖపాత్ర వహించారని తెలిపారు. జిల్లాలో   70 శాతం మహిళలు మంచి సేవలందించారని తెలిపారు. సంయుక్త కలెక్టర్  సుమీత్ కుమార్ మాట్లాడుతూ, దిశా చట్టం మహిళా పోలీస్ లు మహిళల రక్షణకు ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు  తెలిపారు. మండల స్థాయిలో  మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో ఫ్యామిలీ లా కి  సంబంధించిన విషయాలపై అడ్వకేట్ కమ్ రిసోర్స్ పర్సన్ డి. విజయ లక్ష్మి  అవగాహన కలిగించారు. మహిళా రక్షణ, రాజ్యాంగం, క్రిమినల్ లా, సివిల్ రైట్స్ అంశాలపై అడ్వకేట్ కం రిసోర్స్ పర్సన్  డి. సరళ కుమారి అవగాహన కలిగించారు. వైద్య పరమైన అంశాలపై డా. రామ్ మోహన్ రావు, డా. జ్యోత్స్న, డా. ఇందిర అవగాహన కలిగించగా,  ఐ సి డి ఎస్   పి డి  జయదేవి దిశా చట్టం, వన్ స్టాప్ సెంటర్, తదితర అంశాలు వివరించారు.  ఇచ్చాపురం సి.డి.పి.ఓ. నాగరాణి మాట్లాడుతూ, తన కార్యాలయంలో పనిచేస్తున్న  వర్కర్ కు మూగ. చెవిటి పిల్లవాడు పుట్టడంతో ఆమెను ఆమె భర్త  వదిలివేసాడని, ప్రస్తుతం ఇల్లు గడవడం కష్టంగా వుందని, ఆమెకు న్యాయ సహాయం అందించే విధానంపై సలహాను అడిగారు.  ప్రధాన న్యాయమూర్తి స్పందించి, మండల స్థాయిలోని న్యాయ  సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకుని, ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు. రణస్థలం సి.డి.పి.ఓ. జి.లక్ష్మి మాట్లాడుతూ, తమ కార్యాలయపు వర్కరుకు కేన్సర్ వచ్చిందని, ఆమె భర్త ఆమెను వదిలివేసేడని, ఆమెకు ఒక బిడ్డ వున్నాడని, ఆమెకు న్యాయ సహాయంపై సలహా అడిగారు.  జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకుని ఉచిత న్యాయాన్ని పొందవచ్చునని, ప్రభుత్వం నుండి  ఆమె వైద్య ఖర్చులను పొందవచ్చునని ప్రధాన న్యాయ మూర్తి తెలిపారు.    కార్యక్రమంలో జిల్లా సెకెండ్ అడిషనల్ జడ్డ్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్.పి. విఠలేశ్వరరావు, లోక్ అదాలత్ శాశ్వత అధ్యక్షులు సత్యన్నారాయణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, , ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఛైల్డ్ ప్రోటెక్షన్ అధికారి రమణ, సి.డి.పిఓ.లు  రిసోర్స్ పర్సన్ లు  తదితరులు పాల్గొన్నారు.