ఆ కుటుంబాలకు ముందే వచ్చిన దీపావళి పండుగ..
Ens Balu
1
కలెక్టరేట్
2020-11-12 22:18:32
ఒకటిరెండూ కాదు ఏకంగా 234 కుటుంబాల్లో దీపావళి పండుగ మూడురోజులు ముందే వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో వారి ఇళ్లలో ఒక్కసారిగా ఆనందం వెళ్లివిరిసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని రెండో విడత ఖాళీల భర్తీ ప్రక్రియను ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందుగా 234 మంది పశువైద్య సహాయకులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ నియామక పత్రాలను అందజేశారు. ఎట్టిపరిస్థితిలోనూ దీపావళి పండుగకంటే ముందుగానే, అభ్యర్థులకు నియామక పత్రాలివ్వాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారులు అభ్యర్థులకు హుటాహుటిన ఇంటర్వ్యూలు నిర్వహించి, మెరిట్ ప్రకారం ఖాళీలను భర్తీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 234 ఖాళీలను భర్తీ చేయగా, అర్హులు లేకపోవడంతో ఇంకా 148 ఖాళీలు మిగిలిపోయాయి. ఉద్యోగాలు పొందినవారికి తన ఛాంబర్‌లో గురువారం నియామకపత్రాలు అందజేసిన కలెక్టర్, ప్రతీఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎంవిఏ నర్సింహులు, డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ కన్నంనాయుడు, పశువైద్యులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.