ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-11-12 22:24:49
ప్రాజెక్టుల భూసేకరణను నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత పలు సాగునీటి ప్రాజెక్టులు, మినీ రిజర్వాయర్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేపట్టిన భూసేకరణపై సంబంధిత రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీఓ మార్గదర్శకాలపై అధికారులకు ముందుగా అవగాహన కల్పించారు. అనంతరం జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన వివరాలు, ప్రస్తుత పరిస్థితిని ఆయా ప్రాజెక్టుల వారీగా జెసి కిశోర్ అడిగి తెలుసుకున్నారు. తోటపల్లి, వెంగళరాయసాగర్, గుర్లగెడ్డ, కంచరగెడ్డ, అడారుగెడ్డ, గడిగెడ్డ, గుమ్మిడిగెడ్డ ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎంతవరకు భూ సేకరణ జరిగిందీ, ఇంకా సేకరించాల్సిన భూమి, భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. సిఎఫ్ఎంఎస్ విధానం కారణంగా, భూసేకరణకు సంబంధించిన కొన్ని వివాదాలను పరిష్కరించడంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని రెవెన్యూ అధికారులు జెసికి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం కోసం ఇంకా మిగిలిఉన్న భూసేకరణను, నిర్ణీత కాలవ్యవధిని ఏర్పాటు చేసుకొని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇక్కడి నిర్వాసితులకోసం నిర్మిస్తున్న లేఅవుట్లను, ఇళ్ల నిర్మాణాన్ని, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసి, వారికి అప్పగించాలని జెసి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.వెంకటేశ్వర్లు, కెబిటి సుందరి, హెచ్‌వి జయరామ్, సాల్మన్ రాజు, వివిధ ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.