కోవిడ్ నిబంధనలతో దీపావళి..
Ens Balu
4
2020-11-13 14:27:52
శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణహిత దీపావళి జరుపుకోవడానికి జిల్లా ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. దీపావళి సామగ్రి విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల) మైదానంను శుక్ర వారం కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సామగ్రి విక్రయం అనంతరం మైదానాన్ని శుభ్రం చేయాలని, అందుకు అవసరమైతే వినియోగ ఛార్జీలను వసూలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న విక్రయాలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాల మధ్య ఆరు మీటర్ల దూరం పాటించాలని, దీపావళి సామగ్రి కొనుగోళుకు వచ్చే వ్యక్తులు భౌతిక దూరం పాటించుటకు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేసారు. ఈ ఏడాది 20 దుకాణాలకు మాత్రమే మైదానంలో అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిని లాటరీ విధానంలో కేటాయింపు చేస్తారని తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణహిత టపాసులు (గ్రీన్ క్రేకర్స్) మాత్రమే అనుమతించడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీపావళి సామగ్రిని 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విక్రయించుటకు అనుమతించినట్లు కలెక్టర్ చెప్పారు. సామగ్రి కొనుగోళుకు వచ్చే వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. దీపావళి వేడుకలను 14వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీపావళి వేడుకలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షిత చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. కోవిడ్ కాలంలో శానిటైర్ల వినియోగం అలవాటు ఉందని, అయితే శానిటైజర్లు పూసుకుని టపాసులు వెలిగించే ప్రయత్నం చేయరాదని సూచించారు. దీపావళి రోజున ప్రజలు ఇంటివద్దనే ఉన్నందను సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి.జె.డి.ఎస్.ప్రశాంత్ కుమార్, తహశీల్దారు వై.వి.ప్రసాద్, పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.