అనంతలో యోధులకు వందనం..


Ens Balu
2
కలెక్టరేట్
2020-11-13 16:43:31

అనంతపురం జిల్లాలో కరోనా సమయంలో కష్టపడి పని చేసిన వారిని సన్మానించేందుకోసం 'యోధులకు వందనం' కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో 'యోధులకు వందనం' పేరుతో కరోనా సమయంలో కష్టపడి పని చేసిన వారిని సన్మానించేందుకోసం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కరోనా సమయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు, అధికారులు, సిబ్బంది రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవాళి మనుగడ మొదలయినప్పటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, సమస్యల కు వ్యతిరేకంగా పోరాడి బ్రతికి బయటపడ్డామని, అందులో కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాలెంజ్ గా తీసుకుని కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ఆర్డీటీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, అధికారులు అంతా జిల్లాను కరోనా నుంచి బయటపడేసేందుకు చాలా కష్టపడి పని చేశారన్నారు. జిల్లాలో కరోనా వచ్చిన మొదట్లో మాస్కులు, పిపి ఈ కిట్లు కూడా లేవని,  ఒక టెస్టింగ్ కూడా చేయలేని, ఒక ల్యాబ్ లేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితి నుంచి మనమే సొంతంగా మాస్కులు తయారు చేసుకోవడం, పిపి ఈ కిట్లు సమృద్ధిగా ఏర్పాటు చేసుకోవడం, ఒక టెస్టు చేయలేని పరిస్థితి నుంచి రోజుకు 10,000 టెస్టులు చేసే పరిస్థితికి ఎదిగమన్నారు. జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని సిద్ధం చేసుకోగలిగామని, జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలలో సదుపాయాలు, ఆక్సిజన్ సప్లై, అవసరమైన సిబ్బంది నియామకం చేసుకున్నామన్నారు.  అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకుంటూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం : అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో చాలావరకు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు.  కరోనా ను ఎదుర్కోవడంలో రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ప్రతి శాఖ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన వారందరికీ మనం సన్మానించాల్సిన అవసరం ఉందని, కరోనా నేపథ్యంలో అందరూ బాగా పని చేసినా అందులో కొంతమందిని ఆయా శాఖల తరపున సన్మానిస్తున్నట్లు తెలిపారు. కరోనా వచ్చిన ప్రారంభంలో పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉండేదని, అటువంటి పరిస్థితి నుంచి ఛాలెంజ్ గా తీసుకుని అనంతపురం జిల్లా మిగతా జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు, దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.  స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్క్ లను కుట్టించడం మన జిల్లాలోనే మొదలుపెట్టామని, దానిని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మూడు మాస్క్ లు ఇవ్వాలని చెప్పి రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించారన్నారు. కరోనా వచ్చిన పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆస్పత్రిలో ఉన్న సమయంలో పాజిటివ్ రోగులు అనరాదని వారిని కరోనా పాజిటివ్ వచ్చిన వారిగా పిలవాలని చెప్పామని, పాజిటివ్ వచ్చిన వారికి ప్రశాంతత కోసం మన జిల్లాలోనే ముందుగా యోగా, స్పోర్ట్స్, మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా వచ్చిన వారు ఆస్పత్రులలో ఉంటె వారి వద్దకు వెళ్లి ధైర్యం నింపే కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఎన్జీవోల సహాయంతో ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేసి వర్కర్లకు, బీదవారికి, వలసకూలీలకు 15 లక్షల భోజనాల అందజేయడం లాంటి సదుపాయం కల్పించామన్నారు. కరోనాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కరోనా సమయంలో ఉపాధి లేకపోగా, ఉపాధి హామీ పథకం కింద ఎక్కువమందికి పని కల్పించి దాదాపు 15 కోట్ల రూపాయలను ప్రతినిత్యం కూలీలకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే ఉద్యాన ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉన్న సమయంలో జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పండ్ల ఉత్పత్తుల రవాణా కోసం కిసాన్ రైలు తీసుకువచ్చి రైతులకు మేలు చేయడం జరిగిందన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ఆదర్శంగా పని చేయడం జరిగిందన్నారు. అలాగే పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతివారం స్ఫూర్తి అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు.  కరోనా సమయంలో కష్టపడి పనిచేసిన వారి యొక్క శ్రమను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకోసమే యోధులకు వందనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కింది స్థాయిలో అట్టడుగున ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్, వి ఆర్ ఓ, కానిస్టేబుల్, పంచాయతీ సెక్రెటరీ, వాలంటీర్, ఆశావర్కర్లు, ఏ ఎన్ఎంలు ఇలా ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న వారి కోసం యోధులకు వందనం ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఏ కుటుంబంలో అయితే వారి ఆప్తులను కోల్పోయారో వారికి ఆర్థిక స్వాంతన ఇవ్వడానికి ఆర్థిక సహాయం ఏర్పాటు చేశామని, దాతల ద్వారా ఒక కుటుంబానికి 50 వేల రూపాయల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో కూడా ఆర్థిక సహాయం అందించేలా చూస్తున్నామని తెలిపారు. కరోనా అన్నది పూర్తిగా సమసిపోలేదని, ప్రజలందరూ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మనల్ని మనం ఉత్తేజం పొందడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలలో యోధులకు వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం మనలో మరింత స్ఫూర్తిని నింపాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మందికి యోధులకు వందనం కార్యక్రమంలో సన్మానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, వైద్య శాఖ, పారిశుద్ద్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ నుంచి పలువురు కరోనా సమయంలో వారు ఎదుర్కొన్న అనుభవాలు తెలియజేశారు.  అనంతరం కరోనాతో మరణించిన కుటుంబాల సభ్యులకు ఐదు మందికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. తదనంతరం స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులైన ఆర్డిటి ఈడి అన్నే ఫెర్రర్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రత్నాకర్ తరఫున డైరెక్టర్ గురుమూర్తి, ఆర్డీటీ ఏకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ సత్యబాబు బోస్, అనంతపురం సాయి ట్రస్ట్ డైరెక్టర్ విజయ్ సాయి కుమార్ లకు శాలువా కప్పి ప్రశంసా పత్రంలను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే  వైద్య శాఖ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ నుంచి ఎంపిక చేసి వారికి జిల్లా కలెక్టర్ శాలువా కప్పి ప్రశంసా పత్రం, డ్రెస్ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గాయత్రి దేవి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శోభా స్వరూపారాణి, డి పి ఓ పార్వతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.