PMMSY కి 15లోగా దరఖాస్తు చేసుకోవాలి..
Ens Balu
2
Srikakulam
2020-11-13 18:03:01
శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన మంత్రి సంపద యోజన పథకం (PMMSY) కోసం అర్హులైన వారు ఈ నెల 15లోగా APCFSS నవశకం వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2020-21 నుండి ఐదేళ్ల వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల 50 కోట్లు కేటాయించగా, అందులో ఈ ఏడాది జిల్లాకు రూ.7.37 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ పథకం క్రింద ఉప్పినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం, రిజర్వాయర్లలో చేపపిల్లల స్టాకింగ్, సముద్ర జలాల్లో నది ముఖద్వారాల వద్ద పంజారాలు, ఐస్ పెట్టెతో సహా మోటార్ సైకిళ్లు, అక్వాలో వ్యాధి నిర్ధారణ పరీక్ష, సంచార లేబరేటీరీలు, అక్వాక్లినిక్, కొత్త బోట్లు, వలలు, బ్రతికియున్న చేపల విక్రయ కేంద్రాలు, ఇన్సులేటెడ్ వాహనాలు, చేపల అమ్మకానికి ఐసు పెట్టెతో సహా ఆటోలు, ఇ-రిక్షాలు, రిటైలు చేపల మార్కెట్ నిర్మాణము వంటి యూనిట్లను స్థాపించుకోవచ్చని తెలిపారు. ఇతరులకు యూనిట్ ఖరీదులో 60 శాతం లబ్దిదారుని వాటా కాగా 40 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. షెడ్యూలు కులాలు మరియు తెగలకు చెందిన మహిళలు 40 శాతం లబ్ధిదారుని వాటా కాగా 60శాతం రాయితీ లభిస్తుందని ఆయన వివరించారు. కావున ఆసక్తి గల అర్హులైన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప్పినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం సాగు యూనిట్ ఖరీదు రూ.18 లక్షలు కాగా, రిజర్వాయర్లలలో చేపపిల్లల స్టాకింగ్ యూనిట్ ఖరీదు రూ.3 లక్షలని చెప్పారు. సముద్ర జలాల్లో నది ముఖద్వారాల వద్ద పంజారాలు(కేజెస్) యూనిట్ విలువ రూ.5 లక్షలని, రిజర్వాయర్లలో పంజారాలు (కేజెస్) యూనిట్ విలువ రూ.3లక్షలుగా ఉంటుందని తెలిపారు. ఐస్ పెట్టెతో సహా మోటార్ సైకిళ్లు యూనిట్ విలువ రూ.75వేలు, ఆక్వాలో వ్యాధినిర్దారణ పరీక్ష సంచార లేబరేటీరీ/ఆక్వా క్లీనిక్ యూనిట్ విలువ రూ.35 లక్షలుగా ఉంటుందని చెప్పారు. పాత బోటుల స్థానములో కొత్త బోటుల వలల యూనిట్ విలువ రూ.5 లక్షలు కాగా, బ్రతికియున్న చేపల విక్రయ కేంద్రాల యూనిట్ ఖరీదు రూ.20 లక్షలని అన్నారు. ఇన్సులేటెడ్ వాహనాల యూనిట్ ఖరీదు రూ. 20 లక్షలని, చేపల అమ్మకానికి ఐస్ పెట్టెతో సహా ఆటోలు,ఇ-రిక్షాల యూనిట్ ఖరీదు రూ. 3 లక్షలుగా పేర్కొన్నారు. రిటైలు చేపల మార్కెట్ల (హబ్) నిర్మాణం కోసం యూనిట్ ఖరీదు రూ. 100 లక్షలు కాగా, చేపల దుకాణాల (కీయాస్క్) నిర్మాణం కోసం యూనిట్ ఖరీదు రూ. 10లక్షలుగా ఉంటుందని అన్నారు. చేపల అదనపు విలువ జోడించే వ్యాపార కేంద్రాల యూనిట్ ఖరీదు రూ. 50 లక్షలని, ప్రతీ యూనిట్ లబ్ధిదారుల వాటాను బ్యాంకు నుండి రుణంగా పొందవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
దరఖాస్తుదారులు ఆక్వా, మత్స్య రంగమునకు చెందినవారై, తగు శిక్షణ పొంది మంచి నైపుణ్యం కలిగిన వారై యుండాలని అన్నారు. యూనిట్ల మంజూరు కొరకు దరఖాస్తుదారులు 2020 నవంబరు 15వ తేదీలోగా తమ దరఖాస్తులను APCFSS నవశకం వెబ్ సైట్ నందు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు, వారు కోరు పథకంలోని లబ్ధిదారుల వాటా సొమ్ముకు సంబంధించి బ్యాంకు రుణ మంజూరు పత్రం లేదా బ్యాంకు ఖాతా నందు లబ్ధిదారుని వాటాకు సరిపడు సొమ్ము కలిగియున్న పాసు పుస్తకము, ఇతర అనుమతులు, అవసరమైన పత్రాలు, ప్రోజెక్టు రిపోర్టులు ఆన్ లైనులో అప్ లోడ్ చేయవలసి ఉంటుందని చెప్పారు. ఈ విధముగా అప్లోడ్ చేయబడిన దరఖాస్తులు వివరములను జిల్లా స్థాయి కమిటీ వారు పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని, తగిన పత్రాలు లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయని ఆయన స్పష్టం చేసారు.జిల్లా స్థాయి కమిటీలో ఎంపిక కాబడిన వెంటనే దరఖాస్తుదారులకు జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, రూ.50లక్షలకు పైబడిన యూనిట్ల మంజూరుకు రాష్ట్ర స్థాయి కమిటీ వారి ఆమోదం పొందవలసి ఉంటుందని తెలిపారు. ఈ పథకాలు 2021 మార్చి 31లోగా అమలుకావలసి ఉందని ఆయన వివరించారు.