ఈనెల 20నాటికి ధాన్యం కొనుగోలు ప్రారంభం..


Ens Balu
4
Visakhapatnam
2020-11-16 17:12:39

విశాఖజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 20 వ తేదీ నాటికి  ప్రారంభించాలని  జాయింట్ కలెక్టర్ వేణుగోపాల రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, వ్యవసాయం , డీ ఆర్ డీ ఏ, ఐ టి డి ఎ, డీ సీ సీ బి, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్న చిన్న కార రైతుల ఆర్థిక స్వావలంబన కు  ప్రత్యేక దృష్టి పెట్టి వారు పండించిన పంటలకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతులు పండించే ఏ  పంట నైనా సరే తిరస్కరించకుండా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చ ర్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలకు తెలిసే విధంగా ప్రసార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాయిశ్చర్ మీటర్లను అమర్చడంతో పాటు, అవసరమైన మెటీరియల్ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.         ఏఏ గ్రామాలలో పంట కోతలు మొదలు అవుతాయి అన్న విషయాలను ఆయా రైతులతో మాట్లాడాల్సిందిగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కు ఆదేశించారు. అదే విధంగా సంబంధిత డేటా ను సిద్ధం చేయాలన్నారు. కోతలు పూర్తయ్యే సమయానికి ఆయా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల వద్ద గన్నీలను సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో రైస్ మిల్లర్లు ట్రాన్స్పోర్టేషన్ తో సిద్ధంగా ఉండాలన్నారు.       డి ఎస్ ఓ లు  సెంటర్ల మ్యాపింగ్ లను తయారు చేయాలన్నారు.       పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ, జిల్లా లో మొత్తం 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో డీ ఆర్ డీ ఏ , వెలుగు ద్వారా ఐటీడీఏ పరిధిలో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.        ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతి,  డిఆర్డిఎ ప్రాజెక్ట్ అధికారి విశ్వేశ్వరరావు,మార్కెటింగ్ శాఖ  ఏడి కాళేశ్వర రావు, పాడేరు డి పి ఎం సత్య నాయుడు, డిసిసిబి డీజీఎం శ్రీనివాసరావు, డీఎస్ఓ రూరల్ శివ ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరన్న చౌదరి తదితరులు హాజరయ్యారు.