ఏప్రిల్ 10న నవోదయ ప్రవేశ పరీక్ష..
Ens Balu
3
Srikakulam
2020-11-16 17:21:48
శ్రీకాకుళం జిల్లాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన నవోదయ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.గోవింద రావు తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నవోదయ విద్యాలయంలో 2021 -22 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఆన్ లైన దరఖాస్తు విధానం అక్టోబరు 22వ తేదీన ప్రారంభమైందని, డిశంబరు 15వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన వివరించారు. 2021 ఏప్రిల్ 10వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు. 2020 – 21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసే విద్యార్ధులు 2008 మే 1వ తేదీ మరియు 2012 ఏప్రిల్ 30వ తేదీ మధ్య జన్మించి ఉండాలని ఆయన స్పష్టం చేసారు. గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్ధులకు 75 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుందని, అందులో మూడో వంతు సీట్లు బాలికలకు కేటాయిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబిసి, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగులకు రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుందని ఆయన వివరించారు. దరఖాస్తులను www.navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవచ్చని చెప్పారు. సంశయాలు, వివరాలు కావలసిన వారు సంబంధిత జిల్లాల నవోదయ విద్యాలయాల ప్రిన్సిపాల్ ను సంప్రదించవచ్చని సూచించారు. 9వ తరగతి ఖాళీ సీట్లకు ఫిబ్రవరి 13న ప్రవేశ పరీక్ష : 2021 – 22 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లకు వచ్చే ఫిబ్రవరి 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గోవింద రావు చెప్పారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు ఈ నెల 4వ తేదీన ఆన్ లైన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిందని, డిశంబరు 15వ తేదీ లోగా దరఖాస్తు చేయాలని ఆయన వివరించారు. దరఖాస్తు చేయు విద్యార్ధులు 2005 మే 1వ తేదీ మరియు 2009 ఏప్రిల్ 30వ తేదీ మధ్య జన్మించినవారై ఉండాలని ఆయన పేర్కొన్నారు.