సచివాలయాల భవనాలు సత్వరమే పూర్తిచేయాలి..
Ens Balu
2
Tirupati
2020-11-16 17:42:34
గ్రామ సచివాలయాలు, రైతు బారోసా కేంద్రాలు , వై.ఎస్.ఆర్. ఆరోగ్యకేంద్రాలు , పాల సేకరణ కేంద్రాలు వంటివి గ్రామవ్యవస్థను రూపు రేఖలు మార్చే నిర్మాణాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతిష్టాత్మక ఆలోచనఅని నిర్దేశించిన సమయం మేరకు మార్చి 2021 నాటికి పూర్తి కావాలని, ఇంజనీరింగ్ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నరేగా అనుసంధాన శాఖలతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్తతో కలసి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సమీక్షించారు. సమీక్షలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అని గుర్తించి సచివాలయాల, ఆర్ బీ కె ల నిర్మాణాలు అనుకున్న సమయానికి మార్చి 2021 నాటికి పూర్తి చేయాలని అన్నారు. గ్రామ సచివాలయాలు 1012 గాను ఇప్పటివరకు 283 మాత్రమే పూర్తి అయ్యాయని మరో 419 పురోగతిలో ఉన్నాయని త్వరగా ఇంజినీరింగ్ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇంకా 74 సచివాలయాలకు స్థలం ఇబ్బందులు ఉందని తెలిపారని, ఈనెల 17 న ఒక్కరోజులో వాటిపై సంబంధిత ఆర్డీఓ లు, సబ్ కలెక్టర్లు, క్లియరెన్స్ ఇచ్చి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రైతుబరోసా కేంద్రాలు 932 గానూ 336, వై.ఎస్.ఆర్. ఆరోగ్యకేంద్రాలు 721 కి గానూ 225 మాత్రమే పురోగతిలో వున్నాయని, కోవిడ్ ప్రభావం తగ్గుదల నేపద్యంలో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇంజినీరింగ్ శాఖలు తమ పరిధిలో జరుగుతున్న నిర్మాణాల ఏజెన్సీలతో సమావేశం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వై .ఎస్. ఆర్ జలకళ రైతులకు ఒక వరం, రైతు ఆర్థికంగా చితికి పోయేది కేవలం బోరు బావుల వలనేనని, ప్రాధాన్యత గుర్తించి త్వరగా పథకం అమలుకు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జలకళకు 6 వేలు దరఖాస్తులు వస్తే 4 వేల మందికి అర్హత వచ్చిందని సూచించారని, జిల్లాలో డార్క్ ఏరియా ప్రాంతాలు 197 ఉన్నాయని, గత సంవత్సరం నుండి వర్షాలు పడుతున్నందున మరోసారి పరిశీలించి డార్క్ ఏరియా ఎంత వరకు తొలగించాలో నిర్ణయించాలని సూచించారు. జలకళ కు సంబందించి ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు యూనిట్ వచ్చిన విషయం తెలిసిందేనని, డ్రిల్లింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాలలో సి. సి. రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలతో పాటు, జిల్లాలో ఉన్న 4500 చెక్ డ్యామ్ లలో పూడిక తీయడం , చెరువుల అనుసంధానం, సప్లయ్ ఛానెల్స్ పునరుద్ధరణ వంటివి చేపట్టాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ నరేగా లో ఉపాధిహామీ పనులు ఇప్పటివరకు జిల్లాలో 1.61 కోట్ల పనిదినాలు కల్పించామని, ఇప్పటికీ వరకు రూ.180 కోట్లు ఖర్చు చేయగా, మార్చి 2021 నాటికి అనుకున్న విధంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఈ సమీక్షలో తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి , నరేగా డైరెక్టర్ చినతాతయ్య, నరేగా కౌన్సిల్ మెంబర్ విశ్వనాథ్, పిడి డ్వామా చంద్రశేఖర్ , ఎస్.ఇ లు పి. ఆర్. అమరనాథ్రెడ్డి, ఇరిగేషన్ సురేంద్ర నాధ్, ఆర్. డబ్ల్యూ. ఎస్ విజయ కుమార్ , ఇంజనీరింగ్ శాఖల ఇ ఇ లు, డి ఇ లు , అధికారులు పాల్గొన్నారు.