సహకార సంస్థ అభివృద్ధికి కృషిచేయాలి..
Ens Balu
2
Srikakulam
2020-11-16 18:17:55
శ్రీకాకుళం సహకార సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వ్యాపార కార్యకలాపాలను పెంచుతూ సంస్థ అభివృద్ధికి కృషిచేయాలని డివిజనల్ సహకార అధికారి ఎ.వి.రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు 3వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి డివిజనల్ సహకార అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సహకార పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన సహకార సంస్థల శిక్షణ వలన కలిగే ప్రయోజనాలు గురించి సిబ్బందికి వివరించారు. సిబ్బంది తమ వ్యాపార కార్యకలాపాలను పెంచుతూ సంస్థ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. జిల్లా సహకార అధికారి కె.మురళీకృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్థ యొక్క వ్యాపారాలను పెంచి, సంస్థలో ఉన్న సిబ్బందికి పనికల్పించడమే కాకుండా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. రాజమండ్రి సహకార శిక్షణ కేంద్రం అధ్యాపకులు జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్ లైన్ కమ్యూనికేషన్ ద్వారా శిక్షణ మరియు విద్య పునశ్ఛరణ అనే అంశంపై వివరించారు. సంఘ డైరక్టర్ పి.లక్ష్మణరావు మాట్లాడుతూ సంఘ పూర్వపరాలను తెలుసుకోవడం వలన తదుపరి కాలంలో సంస్థ అభివృద్ధికి ఏ విధంగా కృషిచేయాలనే విషయం తెలుస్తుందని , ఆ దిశగా సిబ్బంది పనిచేయాలని కోరారు. సంఘ బిజినెస్ మేనేజర్ గంగు లక్ష్మణకుమార్ మాట్లాడుతూ సంఘం యొక్క వ్యాపార అభివృద్ధి వివరాలను తెలియజేస్తూ సంఘం చేపడుతున్న వ్యాపార కార్యకలాపాలను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని, అందులో లోటుపాట్లను గమనించి వాటిని నివృత్తి చేసుకునే విధంగా సిబ్బంది పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిష్టర్ కె.రాము, యస్.భూషణరావు, సంఘ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.