సర్వీసు రెక్వెస్టులు మరింతగా పెరగాలి..
Ens Balu
3
Bukkarayasamudram
2020-11-16 18:41:04
అనంతపురం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే సర్వీస్ రిక్వెస్ట్ లలో 85 - 90 శాతం సర్వీసులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి మాత్రమే వస్తున్నాయని, అలాకాకుండా సచివాలయాలకు వచ్చే వాటిలో ఇతర శాఖలకు చెందిన సర్వీస్ రిక్వెస్టులు మరిన్ని పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని 1 & 4 సచివాలయాలను, కొర్రపాడు -2 గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 540 సర్వీస్ రిక్వెస్ట్ లను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అన్ని శాఖలకు సంబంధించిన సర్వీసులు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఎక్కువ రిక్వెస్ట్ లు రాగా, ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించి రిక్వెస్ట్ లు వస్తున్నాయని, విద్యుత్ శాఖ నుంచి కూడా సర్వీసులు పెంచేలా చూడాలన్నారు. ప్రజలకు వాలంటీర్ల ద్వారా సచివాలయాల సేవలపై మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సచివాలయాలకు అన్ని శాఖల సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గడువు తీరిన సర్వీసులు ఒకటి కూడా పెండింగ్ ఉంచడానికి వీలు లేదని, ఎప్పటికప్పుడు అన్ని సర్వీసులను నిర్దేశిత గడువు లోపు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బుక్కరాయసముద్రం 1 & 4 గ్రామ సచివాలయాలలో ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఏయే సర్వీసులు ఎక్కువగా వస్తున్నాయి, ఇతర శాఖలకు సంబంధించి ఎందుకు సర్వీసులు తక్కువగా వస్తున్నాయి అనే విషయాలపై సచివాలయ సిబ్బందితో ఆరా తీశారు.