18ఏళ్లు నిండితే ఓటరుగా నమోదు కావాలి..
Ens Balu
2
Visakhapatnam
2020-11-16 18:43:36
విశాఖజిల్లాలో జనవరి 1 , 2021 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ERO) , సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(AERO) తో ఓటర్ల జాబితా ప్రత్యేక సమ్మరీ రివిజన్ - 2021 పై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్డు ప్రకారం ఈ రోజు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాలని కోరారు. ఈ రోజు నుంచి డిసెంబరు 15వ తేది వరకు ముసాయిదా ఓటర్ల జాబితా పై ఫిర్యాదులను స్వీకరించాలని ఈ.ఆర్.ఒ., ఎ.ఈ,ఆర్.ఒ లను ఆదేశించారు. నవంబరు 28, 29 తేదీలలో , డిసెంబరు 12,13వ తేదీలలో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించి పోలింగ్ బూత్ స్థాయిలో అభ్యంతరాలు, ఫిర్యాదులపై ధరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు. కొత్తగా ఓటర్ల నమోదు మొదలుకొని మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం నిర్ణీత ప్రొఫార్మాలయిన 6,7,8, 8ఎ లలో బూత్ లెవెల్ అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అన్నిరాజకీయ పార్టీలకు ఈ సమాచారాన్ని అందించాలని తెలిపారు. అన్నిరాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని కూడా కోరారు. బూత్ లెవల్ అధికారులు స్థానికంగా అందుబాటులో వుండి అవసరమైన ఫ్రొఫార్మాలను సిద్థంగా వుంచుకోవాలని కోరారు. తొలగింపులపై సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో వుంచాలని అన్నారు. ఈ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని నిర్వహించాలని తెలిపారు. “ KNOW YOUR B.L.O” ప్రచారం నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారుల వివరాలు అందరికీ తెలియజేయాలని కోరారు. ఆన్ లైన్ లో www.nvsp.in నందు నమోదు చేసుకోవడం పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.