రైతుకు ఆత్మస్ధైర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
3
Srikakulam
2020-11-17 20:32:49

రైతులకు ఆత్మస్ధైర్యం కల్పించడమే రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంలో  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా భావించే రోజును త్వరలో ముఖ్య మంత్రి తీసుకురానున్నారని చెప్పారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్న ముఖ్య మంత్రి రైతుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా భారం కాకుండా సి.యం చర్యలు చేపడుతున్నారని ఆయన అన్నారు. జల కళ కార్యక్రమం ద్వారా పుష్కలంగా సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రైతుకు సాగు నీరు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం జలకళ అన్నారు. ఉచిత విద్యుత్ ను 9 గంటల పాటు అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమయ్యే సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడవడానికి రైతు అతి ముఖ్యమైన వ్యక్తి అని సి.యం భావిస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి నిలుస్తారని ఆయన అన్నారు.