ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ రూపకర్త సీఎం వైఎస్ జగన్..
Ens Balu
3
Srikakulam
2020-11-17 20:35:17
ప్రత్యేక వ్యవసాయ రూపకర్త రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో శాసన సభాపతి మాట్లాడుతూ దేశంలోనే ప్రత్యేక బడ్జెట్ ను రూపకల్పన చేయడం చారిత్రాత్మకమన్నారు. సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 2019 ఖరీఫ్ పటంకు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్ల వడ్డీ రాయితీని జమ చేయడం జరిగిందన్నారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని ఇచ్చే సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రారంభించడం సంతోషదాయకమని కొనియాడారు. రైతుల తరపున రూ.1031 కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించుటకు ఏర్పాట్లు చేస్తామని చెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వై.యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలుగా శ్రీకాకుళం జిల్లాలో 76,106 మంది రైతులకు రూ.10.68 కోట్లను జమ చేయగా, పెట్టుబడి రాయితీ పరిహారం క్రింద 288.75 హెక్టార్లకు గాను 1438 మంది రైతులకు రూ.43.32 లక్షలను జమ చేసారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం రైతులకు చెల్లింపు చేయడం విశేషమని పేర్కొన్నారు. రైతులకు మద్ధతు ధర ప్రకటన, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, గిడ్డంగుల సౌకర్యం, ధరల విశ్లేషణ, మార్కెంటింగు విశ్లేషణ వంటి అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. గ్రామీణ స్ధాయిలో రైతులకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రైతు కార్యక్రమాలను ప్రజలు చరిత్రలో మరిచిపోలేరని ఆయన ప్రశంసించారు. రైతుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.