రైతులకు ఎంత చేసినా తక్కువే –సీఎం


Ens Balu
3
Srikakulam
2020-11-17 20:39:00

రైతులకు ఎంత చేసినా తక్కువే అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలు మరియు పెట్టుబడి రాయితీ పరిహారం కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 2019 ఖరీఫ్ పటంకు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్ల వడ్డీ రాయితీని జమ చేస్తున్నట్లు చెప్పారు. ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాలకు ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని ఇచ్చే సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ప్రారంభించామని ఆయన పేర్కొంటూ సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన పంటకు 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్ల సహాయాన్ని అందించామని, అక్టోబరులో కురిసిన వర్షాలకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన రైతులకు రెండు నెలల లోపే పెట్టుబడి రాయితీగా రూ.132 కోట్లను అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతుల తరపున రూ.1031 కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించుటకు ఏర్పాట్లు చేసామని పేర్కొన్నారు. అమూల్ సంస్ధతో అనుసంధానం చేసి పాలసేకరణను ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు సి.యం ప్రకటించారు.         వై. యస్.ఆర్ సున్నావడ్డి పంట రుణాలుగా శ్రీకాకుళం జిల్లాలో 76,106 మంది రైతులకు రూ.10.68 కోట్లను జమ చేయగా, పెట్టుబడి రాయితీ పరిహారం క్రింద 288.75 హెక్టార్లకు గాను 1438 మంది రైతులకు రూ.43.32 లక్షలను జమ చేసారు.         ఇచ్చాపురంకు చెందిన రైతు ఇసురు యాదవ్ రెడ్డి మాట్లాడుతూ తనకు పెట్టుబడి రాయితీ లభించిందన్నారు. పంట నష్టపోయిన నెల రోజులు లోపు పెట్టుబడి సహాయం అందడం చరిత్రలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి జగన్ మోహన రెడ్డి మంచి దార్శనికుడని, రైతుల పక్షపాతి అన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేసే ముఖ్య మంత్రి దొరకడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పారు.         కోటబొమ్మాళి మండలానికి చెందిన రోణంకి మల్లేశ్వర రావు మాట్లాడుతూ సున్నా వడ్డీ తనకు లభించిందన్నారు. రుణాలు తీసుకున్న వారికి లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ అమలు చేయడం మంచి పరిణామమని అన్నారు. రైతులను ప్రోత్సహించే ప్రభుత్వం అన్నారు. లక్షలాది రైతులకు ఇది భరోసాగా నిలుస్తుందని మల్లేశ్వర రావు అన్నారు. ముఖ్య మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి దీర్ఘకాలం పనిచేసి రైతులను ఆదుకోవాలని ఆకాంక్షించారు.         ఈ సందర్బంగా రైతులకు చెక్కులను పంపిణీ చేసారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, ఎడి బివి తిరుమల రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ కరిమి రాజేశ్వర రావు., దువ్వాడ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.