అటవీభూములపై గిరిజనులకు సాగుహక్కు..
Ens Balu
2
Vizianagaram
2020-11-17 22:09:49
విజయనగరం జిల్లాలోని అటవీభూములను సాగుచేసుకుంటున్న పేద గిరిజనులకు సుమారు 50వేల ఎకరాకలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి సంబంధించి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్లతరబడి అటవీభూములను సాగుచేసుకుంటున్న పేద గిరిజనులకు సాగు హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు జిల్లాలో ఇప్పటికే పట్టాల పంపిణీని ప్రారంభించామని తెలిపారు. అర్హులైన వారందరికీ సాగు హక్కు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో సుమారు 24వేలమంది గిరిజనులకు దశలవారీగా దాదాపు 50వేల ఎకరాలకు సంబంధించి పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగా తాజాగా 980 మంది గిరిజనులకు సుమారు 1926 ఎకరాల భూమికి సాగుహక్కు కల్పించేందుకు మంగళవారం ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆర్.కూర్మనాధ్, ఇన్‌ఛార్జ్ డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, జిల్లా అటవీశాఖాధికారి(సామాజిక వన విభాగం) ఎస్.జానకిరావు తదితరులు పాల్గొన్నారు.