వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ తో జిల్లాకి రూ.13.4 కోట్లు లబ్ది
Ens Balu
3
Vizianagaram
2020-11-17 22:14:43
విజయనగరం, నవంబర్ 17: జిల్లాలో వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పధకం కింద 40 వేల 200 మంది రూ. 13.4 కోట్లు లబ్ది పొందనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. అదే విధంగా ఈ అక్టోబర్ లో జరిగిన పంట నష్టాలకు పెట్టుబడి రాయితీల క్రింద 18.42 లక్షల రూపాయలను 355 మంది రైతులు నష్ట పరిహారాన్ని పొందనున్నారని తెలిపారు. మంగళ వారం ముఖ్యమంత్రి 2019- వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ, అక్టోబర్ లో జరిగిన అకాల వర్షాల పంట నష్టం పరిహరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసారు. ఈ కార్యక్రమానికి విజయనగరం నుండి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, శంబంగి చిన అప్పల నాయుడు , జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, సంయుక్త కలెక్టర్ జి.సి కిషోర్ కుమార్ హాజరైనారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాలకు 33 శాతం పై బడి పంట నష్టం జరిగిన రైతులు 355 మంది ఉన్నారని, 125 హెక్టార్ల పంట నష్టం జరిగిందని, వీరికి 18.42 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నామని పేర్కొన్నారు. పంట రుణాలు తీసుకొని సంవత్సరం లోపల తిరిగి చెల్లించిన రైతులకు 2.41 కోట్ల రూపాయల చెక్కును వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లబ్దిదారులకు అందజేసారు.
ఈ సీజన్లో జరిగిన నష్టానికి ఈ సీజన్లోనే పరిహారం అందడం ఆనందంగా ఉంది: రైతు అబిప్రాయం :
ఈ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఈ సీజన్లోనే పరిహారం రావడం మొదటిసారిగా చూస్తున్నామని గంట్యాడ మండలం పెంట శ్రీరామ్ పురం గ్రామానికి చెందిన రైతు బోలెం ఎర్రినాయుడు ఆనందాన్ని వ్యక్తం చేసారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కుటుంబం వ్యవసాయ సహాయం, పొదుపు సంఘాల ద్వారా , అమ్మ ఒడి, తదితర పధకాల ద్వారా 2 లక్షల రూపాయల వరకు లబ్ది పొందామని తెలిపారు. వ్యవసాయం దండగని , వదులుకున్దామని అనుకున్నామని , రైతన్న రాజ్యం వచ్చింది కదా చూద్దామని అనుకున్నామని, అయితే మా ఉహలకు మించి ఈ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. ఉమ్మడి కుటుంబం అయినందున సోదరులందరికి వడ్డీ రాయితీ కింద రూ. 24 వేలు అందిందని, రైతు భరోసా నగదు వచ్చిందని, ప్రస్తుతం అన్ని విధాలుగా వ్యవసాయమే మేలని భావిస్తున్నామని, అది మీ వల్లనే జరిగిందని ముఖ్యమంత్రి తో తెలిపారు. రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలం లో అందుతున్నాయని, పంట నష్టాలూ తగ్గాయని అన్నారు. గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలు మేమే కట్టుకునే వారిమని, ఇన్సూరెన్స్ కూడా మేమే చెల్లించేవారమని, మీరు ముఖ్యమంత్రి అయ్యాక ఆ భారం రైతులకు తగ్గిందని పేర్కొన్నారు. గతం లో అప్పులపాలై వ్యవసాయం వద్దనుకున్న మాకు రైతు బాందవునిగా మా కష్టాలను తీరుస్తున్నారని తెలిపారు. ఈ సమావేశం లో వ్యవసాయ శాఖాధికారులు నందు, అన్నపూర్ణ, ఉద్యాన శాఖ డి డి శ్రీనివాస రావు, రైతులు పాల్గొన్నారు.