జిల్లాలో కేంద్ర పథకాల అమలు భేష్..
Ens Balu
3
Vizianagaram
2020-11-18 19:14:35
విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు అద్భంతంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ ప్రతినిధి, జెఎస్ఎస్ కన్సల్టెన్సీ సిఇఓ డాక్టర్ బసవరాజు ప్రశంసించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతినిధిగా ఆయన ఈ నెల 12న జిల్లాకు విచ్చేసి, సుమారు వారంరోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రతీ గ్రామంలో కనీసం పదిమంది లబ్దిదారులతో భేటీ అయ్యారు. పలు ప్రభుత్వ పథకాలను, పనులను పరిశీలించారు. గ్రామ సచివాలయాలను సైతం సందర్శించారు. ఆయన ముఖ్యంగా గ్రామీణ ఉపాధిహామీ పనులు, సామాజిక పెన్షన్లు, గ్రామీణ నీటి సరఫరా, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు, సర్వే రికార్డుల కంప్యూటీకరణ తదితర పనులను పరిశీలించారు. విస్తృత క్షేత్ర పర్యటనలు అనంతరం ఆయన బుధవారం స్థానిక డిఆర్‌డిఏ సమావేశమందిరంలో, జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు ఆధ్వర్యంలో వివిధ జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో కేంద్రప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయని, మంచి ఫలితాలు సిద్దిస్తున్నాయని అన్నారు. అధికారులు తనకు అందజేసిన నివేదికలకు, క్షేత్రస్థాయిలోని అంశాలకు ఏమాత్రం తేడా లేదని అభినందించారు. జిల్లాలో సచివాలయ వ్యవస్థ అమలు తీరును ప్రశంసించారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలోనే ఆరోగ్య కార్యకర్త, సంక్షేమ సహాయకులు, గ్రామ పోలీసును నియమించడం గొప్పవిషయమని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు జరుగుతున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించనున్నట్లు బసవరాజు తెలిపారు. నివేదిక ప్రతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌కు కూడా అందజేశారు. ఈ సమావేశంలో జెసి వెంకటరావుతోపాటు, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, డిపిఓ కె.సునీల్‌రాజ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పి.రవి, డిఆర్‌డిఏ ఎపిడి ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.