స్పీకింగ్ బుక్స్ ఆవిష్కరించిన టిటిడి చైర్మన్..
Ens Balu
2
Tirumala
2020-11-19 15:52:40
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి గురువారం తిరుమలలోని తమ కార్యాలయంలో స్పీకింగ్ బుక్స్ అయిన భగవద్గీత, సంపూర్ణ హనుమాన్ ఛాలిసా పుస్తకాలను ఆవిష్కరించారు. చూపు లేని వారితో పాటు చదువురాని వారు, వయసు పైబడిన వారు సులభంగా ఇందులోని విషయాలను తెలుసుకునే అవకాశముంది. ఈ పుస్తకాలతోపాటు సెల్‌ఫోన్ లాంటి ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది. ఈ పరికరాన్ని ఈ పుస్తకాల్లోని పేజీల్లో గల అక్షరాలపై పెడితే ఆడియో రూపంలో శ్లోకాలు, తాత్పర్యాలు వినిపిస్తాయి. భగవద్గీత హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంలో ఉండగా, సంపూర్ణ హనుమాన్ ఛాలిసా పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అస్సామీ, నేపాలీ, తమిళం, మలయాళం భాషల్లో ఆడియో వినిపిస్తుంది. నచ్చిన భాషను ఎంపిక చేసుకుని ఆ భాషలో ఈ పుస్తకాల్లోని విషయాలను తెలుసుకోవచ్చు. న్యూఢిల్లీకి చెందిన హయోమా సంస్థ ఈ పుస్తకాలను రూపొందించగా, సేఫ్ షాప్ ఆన్‌లైన్ సంస్థ వీటిని మార్కెటింగ్ చేస్తోంది. ఇలాంటి స్పీకింగ్ బుక్స్ రూపొందించడం ప్రపంచంలోనే మొదటిసారి అని సేఫ్ షాప్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సేఫ్ షాప్ సంస్థ ప్రతినిధులు మురళీ, రాకేష్, లహరి, సాయి పాల్గొన్నారు.