యువత వేగాన్ని నియంత్రించాలి..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-19 17:14:04
యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పిస్తూ, రహదారి ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో నేడు నగరంలో స్టాప్ స్పీడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన శ్రీ హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు హిమబిందు రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె ఆహ్వానించారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎంపీ వి.విజయసాయి రెడ్డి వస్తున్నారని తెలిపారు. నిర్వాహకురాలు హిమబిందు రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు శ్రీహర్ష రెడ్డి 2015లో బైక్ ప్రమాదంలో చనిపోవడం జరిగిందని, దేశంలో ఎక్కడా యువత రహదారి ప్రమాదాలలో మరణించరాదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గతంలో హైదరాబాదులో రెండు పర్యాయాలు, బెంగళూరుల్లో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు కాళీమాత ఆలయం వద్ద నుంచి తెన్నేటి పార్కు వరకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా 500 హెల్మెట్లు, 10 వీల్‌చెయిర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతీ వ్యక్తి సురక్షితంగా ప్రయాణం చేయాలని, దీనిపై అవగాహన కల్పించడం ర్యాలీ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ యువత ప్రాణాలు రహదారి ప్రమాదాలలో కోల్పోవడం కుటుంబానికి, సమాజానికి తీవ్ర నష్టమన్నారు. రహదారి బధ్రతా నియమావళిని అనుసరిస్తూ యువత నడచుకోవాలని సూచించారు. యువత దేశ మేధో సంపదగా నిలుస్తారన్నారు. తన బిడ్డను కోల్పోయినప్పటికీ ఇటువంటి కష్టం మరెవ్వరికీ రాకూడదనే మంచి ఉద్దేశంతో హిమబిందు రెడ్డి చేస్తున్న ఈ కార్యక్రమం హర్షణీమన్నారు. కుటుంబంలో తల్లి దండ్రులు తమ పిల్లలకు రహదారి బధ్రత, వాహన వేగ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. కుటుంబం నుంచి ఈ మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.