జిల్లా వ్యాప్తంగా వరల్డ్ టాయిలెట్స్ డే..
Ens Balu
2
Vizianagaram
2020-11-19 17:58:26
విజయనగరం జిల్లాలో ప‌్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల ఎంపిడిఓల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల వినియోగం ఆవశ్యకత, ప్రజారోగ్య పరిరక్షణలో వాటి పాత్ర తదితర అంశాలను వివరిస్తూ అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జియ్యమ్మవలస మండలంలోని బి.జె.పేట, కె.పి.డి.వలస, బిట్రపాడు తదితర గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పి.రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.ఇ. మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నివారణకు సుస్థిర పారిశుద్ధ్యం అనే అంశంపై ఈ ఏడాది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సురక్షిత మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలోని మరుగుదొడ్లకు దూరంగా ఉన్న వర్గాల వారికి ఈ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యంతో వారు నివసించే ప్రాంతాల్లో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరుగుదొడ్డి ఆత్మగౌరవ చిహ్నంగా భావించాల్సి ఉందని, ఇది ప్రాణాలను కాపాడటంతోపాటు ఆరోగ్యపరమైన రక్షణ కూడా కల్పిస్తుందన్నారు. గిరిజన ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం మండలంలోనూ పలు గ్రామాల్లో మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. బలిజిపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. దత్తిరాజేరు, బొబ్బిలి, రామభద్రపురం, భోగాపురం, బొండపల్లి, గుర్ల తదితర మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపిడిఓలు, గ్రామీణ నీటిసరఫరా ఇంజనీర్లు, స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.