పరిశ్రమల సర్వే పక్కాగా నిర్వహించాలి..


Ens Balu
3
Srikakulam
2020-11-20 16:21:20

శ్రీకాకుళం  జిల్లాలో పరిశ్రమల సర్వే పక్కాగా జరగాలని జిల్లా కలక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి (డిఐపిసి) సమావేశం శుక్ర వారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నివాస్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశ్రమల సర్వే సమగ్రంగా జరగాలని అందుకు పక్కాగా కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. వివరాలలో ఎటువంటి తప్పులు ఉండరాదని ఆయన స్ఫష్టం చేసారు. నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమల వివరాలు సైతం సర్వేలో ఉండాలని ఆయన అన్నారు. మండల స్ధాయిలో ఎం.పి.డి.ఓ నేతృత్వంలో ఇంజనీరింగు సహాయకులతో సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలలో యువతకు శిక్షణకు గల అవకాశాలు పూర్తి స్ధాయిలో పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. శిక్షణకు చేరే అభ్యర్ధులకు భోజన, వసతి సౌకర్యాలు, స్టైపెండు వంటి అవకాశాలు పరిశీలించాలని అన్నారు. గ్రానైట్ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. జిల్లాలో 60 గ్రానైట్ కటింగు, పాలిషింగు యూనిట్లు ఉన్నందున అవకాశాలు పరిశీలించాలని చెప్పారు.            జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాల కృష్ణ మాట్లాడుతూ మైక్రో, స్మాల్ అండ్ మీడియం (ఎం.ఎస్.ఎం.ఇ) పరిశ్రమల పరిధిని కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చేసిందన్నారు. కోటి రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.5 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను మైక్రో ఎంటర్ప్రైజెస్ గాను, 10 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.50 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను స్మాల్ ఎంటర్ప్రైజెస్ గాను, 50 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.250 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను మీడియం ఎంటర్ప్రైజెస్ గాను గుర్తించడం జరుగుతుందని వివరించారు. ఎం.ఎస్.ఎం.ఇ పరిశ్రమలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుటకు, విపత్తు సమయంలో సహాయం పొందుటకు విధిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లో నమోదు కావాలని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్  ప్యాకేజీ క్రింద 2020 ఫిబ్రవరి 29 నాటికి ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్లకు రుణాలుగా ఉన్న మొత్తానికి 20 శాతం మేర అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించుటకు, 12 నెలల పాటు మారటోరియం విధింపుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ప్యాకేజీ క్రింద 5333 ఖాతాలు ఉండగా 4925 ఖాతాలకు రూ.75.71 కోట్లను జూరు చేసారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించుటకు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేసిందని, తద్వారా జిల్లాలో జీడిపప్పు, గ్రానైట్ ను ఎగుమతులకు అవకాశాలు ఉన్నట్లు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. కమిటి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (పి.ఎం.ఇ.జి.పి) క్రింద జిల్లా పరిశ్రమల కేంద్రానికి 68 యూనిట్లను లక్ష్యంగా నిర్ధేశించగా 16 యూనిట్లను మంజూరు చేసి, ప్రారంభించడం జరిగిందని తెలిపారు.            పరిశ్రమల స్ధాపనకు 277 దరఖాస్తులు అందగా నిబంధనలకు అనుగుణంగా ఉన్న 244 దరఖాస్తులను డిఐపిసి ఆమోదించింది. ఎం.ఎస్.ఎం.ఇ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్న ఆర్ధిక సహాయానికి జిల్లాలో 721 క్లైమ్ లు రాగా అర్హత మేరకు 592 క్లైమ్ లకు అనుమతులు మంజూరు చేసారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలో యువతకు ఉపాధి కల్పించుటకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్ధ ద్వారా శిక్షణ కల్పించుటకు ప్రతిపాదించింది. 158 ఎం.ఎస్.ఎం.ఇలకు ప్రోత్సాహకాలుగా రూ. 6.53 కోట్లను ఆమోదించడం జరిగింది. ఇందులో పెట్టుబడి రాయితీగా 11 ఎం.ఎస్.ఎం.ఇలకు రూ.2.82 కోట్లు, వడ్డీ రీఇంబర్సుమెంటుగా 84 ఎం.ఎస్.ఎం.ఇలకు రూ.2.09 కోట్లు, విద్యుత్ ఛార్జీల రీఇంబర్సుమెంటుగా 60 యూనిట్లకు రూ.1.60 కోట్లు ఉన్నాయి.  ఈ సమావేశంలో ఆసరా, సంక్షేమ జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీరు ఎస్.శంకర్ నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, కర్మాగారాల డిప్యూటి ఛీప్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కార్మిక శాఖ సహాయ కమీషనర్ సి.హెచ్.పురుషోత్తం, నైపుణ్య అభివృద్ధి సంస్ధ జిల్లా మేనేజర్ డా.గోవింద రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, మార్కెటింగు శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాస రావు, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు వీర శేఖర్, ఎన్.ఏ.సి.ఎల్ ఉపాధ్యక్షులు సి.వి.రాజులు, పి.వి.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు పి.వి.రామ్మోహన్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.