జిల్లా అసుపత్రికి అదనపు వసతులు..
Ens Balu
3
Vizianagaram
2020-11-20 16:36:03
విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రి, ఘోషా ఆసుపత్రిలో అదనపు వసతులను కల్పించేందుకు ఆసుపత్రి అభివృద్ది సంఘం ఆమోదించింది. సంఘ ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో అభివృద్ది సంఘ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 29 అంశాలతో కూడిన అజెండాను సంఘం కన్వీనర్, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కె.సీతారామరాజు సభ్యులకు వివరించగా, సభ్యులు ఆయా అంశాలపై చర్చించి ఆమోదించారు. ఘోషా ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న కేంటీన్ పనులను పూర్తిచేసి, రోగులకు అందుబాటులో తేవాలని నిర్ణయించారు. ఘోషాలో ఆరు వార్మర్లు, ఆపరేషన్ టేబుల్, వివిధ విభాగాలను 5 ఏసిలను, వివిధ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చడానికి, ఓటి కాంప్లెక్స్ మరమ్మతులకు అంగీకరించారు. జిల్లా కేంద్రాసుపత్రిలో డిఎన్‌బి, ఓటి విభాగాలను అభివృద్ది చేసేందుకు, ఇక్కడినుంచి ఆయుష్ విభాగాన్ని కొత్త భవనంలోకి పూర్తిగా తరలించేందుకు, కాంపౌండ్ వాల్ మరమ్మతుకు, కేజువాలిటీ ఫ్లోర్ మరమ్మతుకు, ఆసుపత్రిలో కుర్చీలు, బల్లలు, మంచాలకు రంగులు వేసేందుకు, కిచెన్‌షెడ్ మరమ్మతుకు, వివిధ విభాగాల్లో 4 ఏసిల ఏర్పాటుకు, ఫెన్సింగ్ ఏర్పాటుకు, స్టేషనరీ కొనుగోలుకు ఆమోదం తెలిపారు. జిల్లా ఆసుపత్రికి, ఘోషాసుపత్రికి కొత్తగా 5 ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు కావాలని కమిషనర్‌ను కోరడానికి అంగీకరించారు. అలాగే ఆసుపత్రికి కావాల్సిన మందులు, ల్యాబ్ పరికరాలు, సర్జికల్స్ సరఫరాకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు సైతం సంఘ సభ్యులు ఆమోదం తెలిపారు. జిల్లా ఆసుపత్రికి ఒక అంబులెన్సును మంజూరు చేయాలని ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ను కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, రామారావు తదితర సంఘ సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.