ఆయకట్టుకు పూర్తిగా నీరందించాలి..
Ens Balu
4
Srikakulam
2020-11-20 20:25:35
శ్రీకాకుళం జిల్లాలో జలవనరుల ప్రాజెక్టుల క్రింద భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, భూసేకరణ యూనిట్ల అధికారులతో శుక్ర వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ సమీక్షించారు. తోటపల్లి, మడ్డువలసతో సహా ఇతర ప్రాజెక్టుల క్రింద తక్కువ మొత్తంలో భూ సేకరణ పెండింగులో ఉన్నాయని వాటిపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో అంతే వేగంగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో పనిచేయాలని ఉద్బోదించారు. వివిధ ప్రాజెక్టుల క్రింద కాలువ పనులు పూర్తి కావడం వలన వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందని, తద్వారా రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని, జిల్లా ఆర్ధిక స్ధితిగతులకు బాటలు వేయవచ్చని చెప్పారు. వ్యవసాయక జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు జలయజ్ఞం పనులు పూర్తి చేసి లక్ష్యంగా ఉన్న ఆయకట్టుకు సాగు నీరు అందించడం వలన చిరస్ధాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు అధికారుల సమీక్షలో భాగంగా అటవీ, రెవిన్యూ శాఖలు భూములను స్పష్టంగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. అటవీ భూములు ఉంటే అందుకు ప్రతిఫలంగా ఇతర ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, డివిజనల్ అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల, రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, డిప్యూటి కలెక్టర్లు బి.శాంతి, కాశీవిశ్వనాథ్, ఉద్యానవన సహాయ సంచాలకులు పి.ఎల్.ప్రసాద్, తోటపల్లి కార్యనిర్వాహక ఇంజనీరు రామచంద్రరావు, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, అటవీ శాఖ రేంజ్ అధికారి గోపాల నాయుడు, అణు విద్యుత్ ప్రాజెక్టు అదనపు సి.ఇ బంగారయ్య శెట్టి, డిప్యూటి మేనేజర్ చంద్రశేఖర్, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.