సబ్సిడీ ట్రక్కులకు దరఖాస్తులు ఆహ్వానం..


Ens Balu
3
Srikakulam
2020-11-20 21:17:15

శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన తరగతులు (బి.సి), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఇబిసి), ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్ధులకు రవాణా వాహనాలను సబ్సిడిపై అందించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ శుక్రవారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిసి, ఇబిసి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ అభ్యర్ధులకు స్వయం ఉపాధి కల్పన నిమిత్తం రవాణా వాహనాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెల పేద కుటుంబములకు పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులు ఇళ్ళ వద్దకే నేరుగా చేరవేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంతో అనుసంధానం చేసి లబ్దిదారులకు రవాణా వాహనాలను సబ్సిడీపై సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. లబ్దిదారుని వాటా 10 శాతం, రాయితీ 60 శాతం, మిగిలిన 30 శాతం మొత్తాన్ని బ్యాంకు ఋణము ద్వారా మంజూరు చేసి  స్వయం ఉపాధికి బాటలు వేయుటకు ఉద్దేశించడం జరిందని పేర్కొన్నారు. రవాణా వాహనాలు మంజూరుకు అర్హత గల అభ్యర్థులు స్థానిక గ్రామ/వార్డు సచివాలయములో దరఖాస్తు చేయాలని వారు సూచించారు. నిర్ధేశిత దరఖాస్తును సంక్షేమ సహాయకుల నుండి ఉచితంగా పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు సంక్షేమ సహాయకులకు సమర్పించాలని తెలిపారు. వాహనం యూనిట్ విలువ రూ.5,81,190/- కాగా  60 శాతం రాయితీగా రూ.3,48,714/- పోనూ, లబ్ధిదారుని వాటా 10 శాతం  రూ.58,119/-, బ్యాంకు ఋణము - 30 శాతం     రూ.1,74,357/-గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్దులకు డిశంబరు 4వ తేదీన సంబధిత మండల, మునిసిపాలిటి, మునిసిపల్ కార్పోరేషన్ లలో ఎంపిక కమిటి ఆధ్వర్యంలో స్క్రీనింగ్-  మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని వారు చెప్పారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులు స్క్రీనింగుకు విధిగా హాజరు కావాలని స్పష్టం చేసారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, ఎస్.సి కార్పొరేషన్ ఇడి కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.