సర్వాంగ సుందరంగా మనబడి..
Ens Balu
3
Vizianagaram
2020-11-21 11:17:34
సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలను తలదన్ని, ఆధునిక హంగులతో అలరారుతున్నాయి. చక్కని రంగులు, సరికొత్త వసతులు, అన్ని మౌలిక సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన నాడూ-నేడు కార్యక్రమం విద్యావ్యవస్థలో చరిత్రలో ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం ప్రాధాన్యతాంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దానిలో ఒకటి మనబడి నాడూ-నేడు. ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ మార్పులను తీసుకువచ్చి, ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులను కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం క్రింద జిల్లా వ్యాప్తంగా 2,763 పాఠశాలలు రిజిష్టర్ కాగా, దీనిలో మొదటి దశ క్రింద 1060 పాఠశాలలను ఎంపిక చేసి, రూపురేఖలను మార్చివేసే అభివృద్ది పనులను ప్రారంభించారు. దీనిలో 1040 పాఠశాలలను రాష్ట్రప్రభుత్వ నిధులతో, 20 పాఠశాలలను నాబార్డు నిధులతో అభివృద్ది చేస్తున్నారు. జిల్లాలో నాడూ-నేడు తొలిదశ పనులకు ప్రభుత్వం ఏకంగా రూ.236.82కోట్లను కేటాయించింది. ఈ నిధులతో మొత్తం 8,077 పనులను మంజూరు చేశారు. వీటిలో 3968 పనులు మొదలు కాగా, 754 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటవరకు దాదాపు రూ.120 కోట్లను ఖర్చు చేయడం ద్వారా విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రభుత్వ శాఖలు ఈ పనులను నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది. కేవలం విద్యార్థులకోసమే అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాకానుక తదితర ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. మరోవైపు సర్కారు బడుల్లో ఆంగ్లభాషాబోధను ప్రవేశపెట్టడానికి సిద్దమవ్వడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడూ-నేడు కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, వాటికి నిరంతర నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన బల్లలు, కుర్చీలు, గోడలకు, తరగతి గదులకు రంగులు, సున్నం, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీషు లేబ్స్ ఏర్పాటు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, ఇతర అన్నిరకాల మరమ్మతు పనులు చేపట్టారు. ఎపిఇబ్ల్యూఐడిసి, సమగ్ర శిక్ష, గిరిజన సంక్షేమశాఖ, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ పబ్లిక్‌హెల్త్ మొదలగు ఆరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తల్లితండ్రుల కమిటీల పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. డిసెంబరు 31 నాటికి ఈ పనులన్నిటినీ పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ జిల్లా అంతటా విస్తృతంగా పర్యటిస్తూ, నాడూ-నేడు పనులను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనుల వివరాలు ః -
తొలిదశకు ఎంపికైన పాఠశాలలు ః 1040
మంజూరు చేసిన పనులు ః 8077
అంచనా విలువ ః రూ.236.82 కోట్లు
విడుదల చేసిన రివాల్వింగ్ ఫండ్ ః రూ.126.65 కోట్లు
ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం ః రూ. 119.38 కోట్లు
వివిధ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతున్న పనులు ః -
ఎపిఇబ్ల్యూఐడిసి ః 234
సమగ్ర శిక్ష ః 300
గిరిజన సంక్షేమశాఖ ః 236
పంచాయితీరాజ్ ః 168
ఆర్‌డబ్ల్యూఎస్ ః 56
మున్సిపల్,పబ్లిక్‌హెల్త్ ః 46
మొత్తం ః 1040 పాఠశాలలు