రేపు వరం కాంస్య విగ్రహావిష్కరణ..


Ens Balu
8
Srikakulam
2020-11-21 12:55:36

శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద అంధవరపు వరహా నరసింహం ( వరం ) కాంస్య విగ్రహావిష్కరణ ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఇంటాక్ కన్వీనర్ మరియు సభ్యులు కె.వి.జె.రాధాప్రసాద్ వెల్లడించారు. స్థానిక వరం రెసిడెన్షిలో వరం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంపై ఇంటాక్ కన్వీనర్ శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నవ శ్రీకాకుళం పురపాలక సంఘ సంస్కర్త, పట్టణ అభివృద్ధి ప్రణాళికల ఆవిష్కర్త, అనితర సాధ్యమైన చరిత్ర సృష్టికర్త అయిన కీ.శే.అంధవరపు వరహా నరసింహం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నవంబర్ 22న సాయంత్రం 04.00గం.లకు ఏడురోడ్ల కూడలిలో ఇంటాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయానికి మారుపేరు వరం అని, పదవి, రాజకీయాలతో నిమిత్తం లేకుండా నగర, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధితో సిక్కోలును అభివృద్ధి బాట పట్టించిన మహోన్నత వ్యక్తి వరం అని కొనియాడారు. ప్రజాభిమానంతో 1981 నుండి 1992 వరకు మునిసిపల్ ఛైర్మన్ గా ఆ పదవికే వన్నెతెచ్చారని అన్నారు. ఆయన ఛైర్మన్ గా కొనసాగిన కాలంలో మునిసిపల్ సిబ్బంది కంటే ముందుగానే విధులకు హాజరుకావడం ఆయన పదవికి ఇచ్చిన గౌరవంగా చెప్పవచ్చని గుర్తుచేసారు. వరం పవర్ ప్రోజెక్టు రూపకర్త, శ్రీసత్యసాయి మందిరం నిర్మాణ కమిటీకీ శాస్వత అధ్యక్షులుగా, కళింగ కోమటి సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా, శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జిల్లా అధ్యక్షులుగా అన్ని రంగాలకు వన్నెతెచ్చిన వ్యక్తి వరం అని కొనియాడారు. అటువంటి గొప్పవ్యక్తి కాంస్య విగ్రహం ఏర్పాటుచేసేందుకు ఇంటాక్ ఆలోచన చేసిందని, విగ్రహా విష్కరణ కొరకు జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని, తద్వారా ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.   కీ.శే. అంధవరపు వరహా నరసింహం ( వరం )  కాంస్య విగ్రహాన్ని దేశంలోనే పేరొందిన ప్రముఖ శిల్పి  డి.రాజకుమార్ వుడయార్ ( తూ.గో.జిల్లా, కొత్తపేట ) తయారుచేసారని, నగరంలో ఇప్పటివరకు సిమెంట్ విగ్రహాలే ఉన్నాయని తొలి కాంస్య విగ్రహం ఇదే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మరో ముఖ్యఅతిథిగా, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, ఇంటాక్ ముఖ్యపోషకులు మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ విశిష్ఠ అతిథులుగా  హాజరుకానున్నారని చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు గౌరవ అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. వరం రెసిడెన్షి అధినేత అంధవరపు సంతోష్ మాట్లాడుతూ నగరంలో తన తండ్రి కాంస్య విగ్రహావిష్కరణతో తమ కళ సాకారమవుతుందని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కేవలం రెండు మాసాల్లో పూర్తిచేయడం సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన ఇంటాక్ కన్వీనర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేయోభిలాషులు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేసారు. కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో ఇంటాక్ సహ కన్వీనర్ సురంగి మోహనరావు, నూక సన్యాసిరావు, ట్రెజరర్ నటుకుల మోహన్, అంధవరపు కుమార్, అంధవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.